గణేష్ ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌పై నిషేధం
- నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ పరికరాలు సీజ్..
- నిర్వాహకులకు రూరల్ పోలీసుల కౌన్సెలింగ్
నర్సాపురం, ఆంధ్రప్రభ : గణేష్ ఉత్సవాలు, ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై నర్సాపురం రూరల్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అధిక శబ్దంతో డీజేలు నిర్వహించరాదని స్పష్టం చేస్తూ నిర్వాహకులకు అవగాహన కల్పించారు. నరసాపురం రూరల్ సర్కిల్ పరిధిలోని డీజే నిర్వాహకులతో మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నరసాపురం మండలం, మొగల్తూరు మండలాలకు చెందిన డీజే నిర్వాహకులకు శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు, పోలీస్ శాఖ మార్గదర్శకాలపై కౌన్సెలింగ్ ఇచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకర్‌రావు ఆదేశాల మేరకు నరసాపురం రూరల్, మొగల్తూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నరసాపురం రూరల్ సీఐ ఎం. నాగరాజు, నరసాపురం రూరల్ ఎస్‌ఐ కె.ఎస్. సతీష్, మొగల్తూరు ఎస్‌ఐ జి. వాసు మాట్లాడుతూ.. పండుగలు, ఊరేగింపులు, ఇతర కార్యక్రమాల సమయంలో అధిక శబ్దంతో డీజే సౌండ్ సిస్టమ్‌లు వినియోగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్‌లు వినియోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ సూచనలు, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించి డీజేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సౌండ్ పరికరాలను సీజ్ చేసే అవకాశం ఉంటుందని నిర్వాహకులను హెచ్చరించారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీజే నిర్వాహకుల నుంచి బైండ్‌ఓవర్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పండుగలు, ఊరేగింపులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖకు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ, శబ్ద కాలుష్య నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని.. నిబంధనలు అతిక్రమించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
