బహుదా నదిలో క్రమంగా తగ్గుతున్న వరద ఉధృతి

వంశధారలో కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో :

ఒడిశాతో పాటు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా నదుల్లో పెరిగిన వరద ఉధృతిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. గురువారంతో పోలిస్తే బహుదా నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టగా, నాగావళి నదిలో స్వల్పంగా పెరిగింది. గురువారం నాగావళి నదిలో 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. శుక్రవారం ఉదయం 10 గంటల నాటికి తోటపల్లి, నారాయణపురం ఆనకట్టల వద్ద 47,900 క్యూసెక్కులకు, శ్రీకాకుళం పాత వంతెన వద్ద 48,500 క్యూసెక్కులకు ప్రవాహం పెరిగింది. అయితే ఈ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే తక్కువేనని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు వంశధార నదిలో గొట్టా బ్యారేజీ వద్ద వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 77,457 క్యూసెక్కుల వరద వస్తుండటంతో కుడి, ఎడమ కాలువలను మూసివేసి, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గురువారం నుంచి అమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరిక శుక్రవారం కూడా కొనసాగుతోంది. అయితే కాట్రగడ సైడ్‌ వేర్‌ ద్వారా వంశధార నీటిని హిరమండలం రిజర్వాయర్‌కు తరలించేందుకు అవసరమైన ప్రవాహం అందుబాటులో ఉంది.

ఇచ్ఛాపురం వద్ద బహుదా నదిలో వరద ఉధృతి గణనీయంగా తగ్గడం జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు ఊరటనిస్తోంది. గురువారం ఈ నదిలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 79,820 క్యూసెక్కుల వరద ప్రవహించగా, శుక్రవారం ఉదయం 10 గంటలకు 60,297 క్యూసెక్కులకు తగ్గింది. వర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదా నదిలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ఇంకా ప్రవాహం కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎవరూ చేపల వేటకు, స్నానాలకు నదులు, కాలువల వద్దకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు.