అచ్చంపేట బస్టాండ్‌లో అధ్వాన పరిస్థితులు..

అచ్చంపేట, ఆంధ్రప్రభ: ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అచ్చంపేట బస్టాండ్‌లో అపరిశుభ్రత, అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. బస్టాండ్‌ ఆవరణలో నీటి పైప్‌లైన్‌ లీకేజీ కావడంతో భారీగా నీరు వృథా అవుతోంది. లీకైన నీరు అక్కడే నిలిచిపోవడంతో పరిసరాలు బురదమయంగా మారి, దుర్వాసన వెదజల్లుతోంది. బస్సు డిపో నుంచి బస్టాండ్‌లోని మరుగుదొడ్లు, స్నానపు గదులకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌ బైపాస్‌ పాయింట్‌ వెనుక భాగంలో ఈ లీకేజీ ఏర్పడినట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా నీరు నిలిచిపోవడంతో అక్కడ మురుగు, బురద పేరుకుపోయింది. దీనికితోడు నిలిచిన నీటిలో పందులు సంచరిస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రతిరోజూ బస్టాండ్‌కు వచ్చే వందలాది మంది ప్రయాణికులు దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతానికి సమీపంలోనే ఈ పరిస్థితి ఉండటంతో అసౌకర్యానికి గురవుతున్నామని వారు వాపోతున్నారు.

నీటి వృథాపై ప్రయాణికుల ఆగ్రహం

ఒకవైపు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తుండగా, మరోవైపు బస్టాండ్‌లో పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా విలువైన నీరు వృథా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ కారణంగా నీరు నిలిచిపోవడంతో దోమలు, ఇతర కీటకాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్‌లైన్‌ లీకేజీని వెంటనే మరమ్మతు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పేరుకుపోయిన బురద, మురుగును తొలగించి, పందుల సంచారాన్ని అరికట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.