Ba295-Flight-Drops-28000-Feet : బ్రిటీష్ ఫ్లైట్ కలకలం Andhera Prabha Top News
Ba295-Flight-Drops-28000-Feet : బ్రిటీష్ ఫ్లైట్ కలకలం Andhera Prabha Top News
- గాల్లో 4 గంటలు చక్కర్లు
- 10 నిమిషాల్లో 28 వేల అడుగులు కిందకు
- లండన్ నుంచి చికాగో వెళ్తుండగా తీవ్ర సాంకేతిక సమస్య
- 37 వేల అడుగుల నుంచి 9 వేల అడుగులకు ఆకస్మిక పతనం
- విమానంలో ఆక్సిజన్ మాస్కులు..
- ప్రయాణికుల్లో భయాందోళనలు
- చివరకు సురక్షితంగా హీత్రోకు చేరిక
( లండన్, ఆంధ్రప్రభ ప్రతినిధి )
ఆకాశంలో 37 వేల అడుగుల ఎత్తులో ప్రశాంతంగా ప్రయాణిస్తున్న విమానం.. ఒక్కసారిగా 28 వేల అడుగులు కిందకు పడిపోయింది. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే విమానం 9 వేల అడుగుల ఎత్తుకు చేరింది. ఆక్సిజన్ మాస్కులు బయటకు రావడంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు. పరిస్థితిని గమనించిన పైలట్లు విమానాన్ని గమ్యస్థానానికి తీసుకెళ్లకుండా తిరిగి లండన్‌కు మళ్లించారు.
బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన BA295 విమానం సోమవారం ఉదయం 11.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4.30 గలకు) లండన్‌లోని హీత్రో విమానాశ్రయం నుంచి అమెరికాలోని చికాగో ఓ’హేర్ విమానాశ్రయానికి బయలుదేరింది. టేకాఫ్ తర్వాత విమానం సాధారణంగానే 37 వేల అడుగుల క్రూయిజింగ్ ఎత్తుకు చేరుకుంది.ప్రయాణం ప్రారంభమైన గంటకు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
37 వేల నుంచి 9 వేల అడుగులకు..
విమానంలో అత్యవసర పరిస్థితిని సూచించే ‘స్క్వాక్ 7700’ కోడ్ జారీ అయింది. అదే సమయంలో విమానం అత్యంత వేగంగా కిందికి దిగడం ప్రారంభించింది. ట్రాకింగ్ సమాచారం ప్రకారం.. 37 వేల అడుగుల నుంచి కేవలం పది నిమిషాల్లోనే 9 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. అంటే ఏకంగా 28 వేల అడుగుల పతనం.దీన్ని అర్థం చేసుకోవాలంటే.. దుబాయ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఎత్తు 2,722 అడుగులు. దానితో పోలిస్తే విమానం దిగిన ఎత్తు దాదాపు పది రెట్లు ఎక్కువ.
అకస్మాత్తుగా ఆక్సిజన్ మాస్కులు
విమానంలో ఉన్న ప్రయాణికుల కథనం ప్రకారం.. అంతకుముందు ప్రయాణం సాధారణంగానే సాగింది. అయితే ఒక్కసారిగా కుదుపులు మొదలయ్యాయి. ఆ వెంటనే ఆక్సిజన్ మాస్కులు కిందకు జారాయి.ప్రయాణికుడు టామ్ నికోల్స్ మాట్లాడుతూ.. విమానం కిందికి దిగుతున్న విషయం తెలిసినా, అది అత్యంత వేగంగా జరుగుతున్నట్లు తనకు అనిపించలేదని చెప్పారు. పైలట్లు పరిస్థితిని సమర్థంగా నిర్వహించారని పేర్కొన్నారు.
క్సిజన్ మాస్కులు బయటకు వచ్చిన తర్వాత కొంత గందరగోళం నెలకొందని తెలిపారు. అయితే కొద్దిసేపటికే కెప్టెన్ విమానం 10 వేల అడుగుల కంటే దిగువకు వచ్చిందని ప్రకటించడంతో వాటి అవసరం లేదని ప్రయాణికులకు స్పష్టమైందన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న భారతీయ మహిళ గౌరీ జయరామ్ మాత్రం ఆ క్షణాలను భయానకంగా అభివర్ణించారు. విమానం ల్యాండింగ్‌కు దిగుతున్నట్లుగా ఒక్కసారిగా కిందికి వెళ్తున్న అనుభూతి కలిగిందని చెప్పారు. వెంటనే అలారాలు మోగడం, ఆక్సిజన్ మాస్కులు వేలాడటం చూసి తాను తీవ్రంగా ఆందోళనకు గురయ్యానని తెలిపారు.
నాలుగు గంటల పాటు గాల్లోనే..
ఆకస్మిక పతనం తర్వాత విమానం నేరుగా హీత్రోకు రాలేదు. బ్రిస్టల్ ఛానల్ పరిసరాల్లో దాదాపు నాలుగు గంటల పాటు చక్కర్లు కొట్టింది. అనంతరం సాయంత్రం 5 గంటల తర్వాత హీత్రో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. అత్యంత శిక్షణ పొందిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా హీత్రోకు తీసుకొచ్చారని తెలిపింది. ప్రయాణికులు సాధారణంగానే విమానం నుంచి దిగారని, వారి తదుపరి ప్రయాణ ఏర్పాట్లను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.
క్యాబిన్ ప్రెషర్ సమస్యేనా?
అసలు విమానం అంత వేగంగా ఎందుకు కిందికి దిగింది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ ‘సాంకేతిక సమస్య’ అని మాత్రమే పేర్కొన్నప్పటికీ.. విమానయాన రంగ నిపుణులు క్యాబిన్ ప్రెషర్ తగ్గిపోయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.క్యాబిన్‌లో గాలి ఒత్తిడి తగ్గితే.. ప్రయాణికులు, సిబ్బందికి తగినంత ఆక్సిజన్ అందించేందుకు విమానాన్ని వేగంగా తక్కువ ఎత్తుకు తీసుకురావాల్సి ఉంటుంది. సాధారణంగా 10 వేల అడుగుల కంటే దిగువ ఎత్తులో అదనపు ఆక్సిజన్ అవసరం తక్కువగా ఉంటుంది.
బ్రిటిష్ ఎయిర్‌వేస్ మాజీ పైలట్ అలస్టెయిర్ రోసెన్‌షైన్ కూడా విమానం 9 వేల అడుగుల వరకు దిగిన తీరును పరిశీలిస్తే క్యాబిన్ డీప్రెషరైజేషన్ వంటి అత్యవసర పరిస్థితి ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
అధికారికంగా సమస్యకు కారణాన్ని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఇంకా వెల్లడించలేదు.
ఇంధనం తగ్గించేందుకే చక్కర్లు?
విమానం నాలుగు గంటల పాటు గాల్లోనే తిరగడంపైనా విమానయాన నిపుణులు ఆసక్తికరమైన కారణాన్ని చెబుతున్నారు. అత్యవసరంగా తిరిగి రావాల్సి వచ్చినప్పుడు విమానం పూర్తి ఇంధనంతో ఉంటే.. వెంటనే ల్యాండింగ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. విమాన బరువును సురక్షిత ల్యాండింగ్ పరిమితికి తీసుకురావడానికి కొంతసేపు గాల్లో చక్కర్లు కొడుతూ ఇంధనాన్ని ఖర్చు చేసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
శరీరంపై ఎలాంటి ప్రభావం?
విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దిగితే ప్రయాణికుల శరీరంపై ప్రభావం తప్పదు. ముఖ్యంగా బరువులేని అనుభూతి, కడుపు ఒక్కసారిగా కిందికి జారినట్లుగా అనిపించడం వంటివి కలుగుతాయి. రోలర్ కోస్టర్‌లో వేగంగా కిందికి దిగినప్పుడు కలిగే అనుభూతిని పోలి ఉంటుంది.
ఇలాంటి సమయంలో అసలు ప్రమాదం ప్రయాణికుల శరీరానికంటే క్యాబిన్‌లోని వదులుగా ఉన్న వస్తువుల వల్ల ఎక్కువగా ఉండొచ్చు. బ్యాగులు, ఫోన్లు, ఆహార ట్రేలు, ఇతర వస్తువులు గాల్లోకి ఎగిరి ప్రయాణికులను గాయపరచే అవకాశం ఉంటుంది.
సీటుబెల్ట్ పెట్టుకోకుండా ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా పైకప్పును, సీట్లను లేదా ఇతర ప్రయాణికులను ఢీకొనే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే సీట్‌బెల్ట్ సైన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ విమాన ప్రయాణంలో వీలైనంత వరకు బెల్ట్ పెట్టుకోవాలని విమానయాన నిపుణులు సూచిస్తారు. విమానం వివిధ గాలి పొరల గుండా వేగంగా కదులుతున్నప్పుడు చెవుల్లో ఒత్తిడి మార్పులు సంభవించి చెవులు మూసుకుపోవడం లేదా తాత్కాలిక అసౌకర్యం కలగవచ్చు.
వారం రోజుల్లో రెండో ఘటన
ఈ ఘటనకు వారం రోజుల ముందే దుబాయ్ నుంచి తెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం కూడా ఆకస్మికంగా దాదాపు 17 వేల అడుగుల మేర కిందికి దిగింది. అనంతరం సౌదీ అరేబియాలో అత్యవసర ల్యాండింగ్ చేసింది.వరుసగా చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు విమాన ప్రయాణ భద్రతపై చర్చకు దారితీశాయి. అయితే రెండు ఘటనలకు కారణాలు ఒకటేనా? అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
