అడవి ఆహార పదార్థాలు, ఔషధ మూలికలపై అవగాహన సదస్సు
వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని పెనుగోలు కాలనీలో కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అడవి ఆహార పదార్థాలు, ఔషధ మూలికలు, సంప్రదాయ జ్ఞానాన్ని పద్ధతిగా నమోదు చేయడంపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటవీ శాఖకు చెందిన గొంది నారాయణ, ఎఫ్బీఓ హాజరై మాట్లాడారు. అడవి ఆహార పదార్థాలు, ఔషధ మూలికలు గ్రామీణ, గిరిజన సమాజాల జీవన విధానంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయని అన్నారు. తరతరాలుగా ప్రజలు అడవిలో లభించే వివిధ ఆకులు, కాయలు, పండ్లు, వేర్లు, గింజలు, ఇతర సహజ వనరులను ఆహారంగా ఉపయోగిస్తూ వస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా స్థానికంగా లభించే ఔషధ మొక్కల ఉపయోగం, వాటి గుర్తింపు, సేకరణ, సంప్రదాయ వినియోగంపై సమాజంలో విలువైన జ్ఞానం ఉందన్నారు. స్థానిక ప్రజల్లో ఉన్న అడవి ఆహారాలు, ఔషధ మూలికలకు సంబంధించిన సంప్రదాయ జ్ఞానాన్ని సేకరించి, పద్ధతిగా నమోదు చేయడం ఈ అధ్యయనం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచడంతో పాటు జీవవైవిధ్య పరిరక్షణ, స్థానిక సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటం ఈ నమోదు కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మురుమూరు గ్రామపంచాయతీ సర్పంచ్ మడకం సుభద్ర, ఉప సర్పంచ్, వాజేడు మండల సమన్వయకర్త జి. కామేష్, యానిమేటర్లు పి. స్వరూప, సిహెచ్. రమాదేవి, సిహెచ్. భాస్కర్, దీపిక, ప్రసాద్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
