పోషకాహారంతో పిల్లల సమగ్ర అభివృద్ధి..

  • అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ, ఆరోగ్యంపై అవగాహన పెంచాలి

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి ప్రాజెక్టు ఆధ్వర్యంలో కాటాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ప్రేమలత మాట్లాడుతూ పిల్లలకు జంక్‌ఫుడ్‌కు బదులుగా ఇంట్లో తయారు చేసే పోషకాహార చిరుతిళ్లను అందించాలని సూచించారు. ముఖ్యంగా పల్లిపట్టి వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలని తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రంలో అందించే మధ్యాహ్న భోజనాన్ని తల్లులు స్వయంగా పరిశీలించి, పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందేలా సహకరించాలని కోరారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రం అభివృద్ధి, నిర్వహణ గ్రామంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అవగాహన కల్పించారు.

సర్పంచ్‌ మోహన్‌రావు మాట్లాడుతూ అంగన్‌వాడీ స్థాయిలో పోషణ, ఆరోగ్యం, ప్రీ-స్కూల్‌ విద్యకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సుమతి, ప్రథం ఎన్‌జీఓ జిల్లా కోఆర్డినేటర్‌ అనిల్‌, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, అంగన్‌వాడీ టీచర్లు శ్రీకళ, సరిత, సమ్మక్క, నిర్మల తదితరులు పాల్గొన్నారు.