రచయిత మల్లారెడ్డికి దక్కిన అపూర్వ గౌరవం
హైదరాబాద్ రవీంద్రభారతిలో 12న కార్యక్రమం
నాలుగు సంవత్సరాలుగా పురస్కారాల ప్రదానం
కళలు, సాహిత్యంపై రజనిశ్రీకి ఎంతో మక్కువ
ఈసారి శ్రీకాకుళం జిల్లా వాసి మల్లారెడ్డికి చాన్స్
పెద్దపల్లి, ఆంధ్రప్రభ :
హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ నెల 12న ఆచార్య రజనిశ్రీ సాహిత్య పురస్కారం ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఏడాది రజనిశ్రీ పురస్కారానికి శ్రీకాకుళం జిల్లా కంచిలి గ్రామానికి చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డు అధికారి మల్లారెడ్డి మురళీ మోహన్ ఎంపికయ్యారు. ఈ పురస్కారం నాలుగేళ్లుగా ప్రదానం చేస్తున్నారు. మల్లారెడ్డి రాసిన నిశాచరుడి దివాస్వప్నం అనే కవిత సంపుటి ఎంపికైంది.
ఆచార్య రజనిశ్రీ ప్రస్థానం…
ఆచార్య రజనిశ్రీ అసలు పేరు గాజుల రాజేశం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.1944లో సిరిసిల్లలో జన్మించారు. వీరి స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి. ఆయన చేనేత కార్మిక కుటుంబానికి చెందిన వారు. ఎంఏ బీఈడీ చేసిన రాజేశం 1964 నుంచి 2002 వరకూ ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు జి. వి. శ్యాంప్రసాద్ లాల్ ( కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి), రెండవ కుమారుడు హరీష్ కుమార్ (హైకోర్టులో న్యాయవాది), మూడో కుమారుడు క్రాంతి కుమార్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్). ఆయనకు కళలు, సాహిత్యంపై మక్కువ. అందుకే ఈ రెండింటిపై ఆయన ప్రయాణం సాగింది.
కళలు వైపు ప్రయాణం…
రజనిశ్రీకి కళలపై మక్కువ అని గ్రహించిన గంగం తిరుపతిరెడ్డి 1955లో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పాటలు పాడించారు. అదే సందర్భంలో మలయశ్రీతో పరిచయం కావడంతో సాహిత్యం వైపు కూడా ఆయన ప్రయాణం సాగింది. ప్రఖ్యాత నాట్యచార్యులు నటరాజ రామకృష్ణ వద్ద శిష్యరికంలో ఆంధ్రనాట్యం, అంజిబాబు వద్ద కథక్ నృత్యాన్ని నేర్చుకున్నారు. తాను పనిచేసే పాఠశాల విద్యార్థులకు ఆంధ్ర నాట్యం కూడా నేర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇటు ఆంధ్ర నాట్యం, అటు కథక్ తోపాటు జానపద పాటలకు సొంతంగా నృత్య రూపకాలు రూపొందించి ఇచ్చిన ప్రదర్శనలు ప్రేక్షకాదరణ పొందింది. వేమన నాటకంలోని దేవదాసి, శ్రీకృష్ణతులాభారంలోని సత్యభామ, రుక్మిణి, నళిని, సత్యహరిశ్చంద్రలో చంద్రమతి, రామాంజనేయ యుద్ధంలో శాంతిమతి, అల్లూరి సీతారామరాజులో సీత, వరూధిని ప్రవరాఖ్యలో వరూధిని పాత్ర పోషించి ఆ పాత్రలకు జీవం పోశారు.
సాహిత్యం వైపు..
రజనిశ్రీ తాను నటించిన నాటకాలల్లో ఎక్కువ భాగం తానే స్వయంగా రాసుకొని వాటికి నృత్య రూపం ఇచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. చైతన్య గీతాలు పేరుతో పాటల పుస్తకాన్ని వెలువరించారు. నాట్య కళా వైభవం అనే పుస్తకం రచించారు. కేవలం నాట్యం, నటన, దర్శకత్వం, కవిత్వం, గేయ రచయిత గానే కాకుండా కళాజ్యోతి కల్చరల్ అసోసియేషన్, నటరాజు నృత్య కళాక్షేత్రం వంటి సాంస్కృతిక, కళా సంస్థలను స్థాపించి ఎందరో ఔత్సాహిక నటులకు అవకాశం ఇచ్చారు. మరెందరినో తీర్చిదిద్దారు. ఇలా తన జీవితమంతా సాహిత్య, సాంస్కృతిక కళలకే ధారపోసిన మహానుభావుడు.
రజనిశ్రీ అందుకున్న పురస్కారాలు
- 1976లో నాట్య విశారద ను వరంగల్ కాకతీయ కల్చరల్ అకాడమీ ప్రదానం చేసింది
- 1980లో నాట్యరత్న పురస్కారాన్ని ముఖ్యమంత్రి టి. అంజయ్య ప్రదానం చేశారు.
- నాట్య మయూరి పురస్కారాన్ని నెల్లూరు నెఫ్జా నాటక కళాపరిషత్ ప్రదానం.
- 1984లో గాంధీ విచారమంచ్ వారిచే నాట్య నిష్ణాత ప్రదానం
- 1986లో సారస్వత జ్యోతి మిత్రమండలి వారిచే నాట్య కళా ప్రపూర్ణ
- 1988లో మనోరంజని పురస్కారం
- 1990లో మనోరంజని వారిచే ఉపాధ్యాయ రత్న
- 1992లో కనకదుర్గ కల్చరల్ అకాడమీ, విజయవాడ వారిచే నాట్య కౌముది
- 1996లో మనోరంజనీ హైదరాబాద్ వారిచే ఎన్టీఆర్ స్మారక అవార్డు
- 1998లో అన్నమయ్య కల్చరల్ అకాడమీ కరీంనగర్ వారిచే ప్రజావాద కళారత్న
- 1999లో కళావాహిని మంచిర్యాల వారిచే నృత్యశ్రేష్ట
- 1999లో భావన ఆర్ట్ అకాడమీ బద్వేల్ కడప వారిచే కళాసామ్రాట్, రాగా కల్చరల్ అకాడమీ జాక్ వారిచే రాగా పురస్కారం
- 2000లోస్ఫూర్తి అసోసియేషన్ వారిచే స్ఫూర్తి అవార్డు
- 2001లో పద్మ పీఠం వారిచే పద్మ పీఠం అవార్డు
- 2004లో నటరాజ నృత్య కళానికేతన్ ఖమ్మం వారిచే నాట్య కళానిధి
- 2005లో రాగ మయూరి ఆర్ట్ థియేటర్ వారిచే రాఘమయూరి పురస్కారం అందుకున్నారు.