మహిళలపై దాడి.. సీపీఐ(ఎం) ఆగ్రహం!
అల్మాస్గూడ ఘటనపై ఖండన.. నిందితులను శిక్షించాలని డిమాండ్
రంగారెడ్డి జిల్లా, ఆంధ్రప్రభ: బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడలో ఇద్దరు దళిత మహిళలపై జరిగిన దాడి ఘటనను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మత మార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటం దారుణమని పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
సీపీఐ(ఎం) తెలిపిన వివరాల ప్రకారం.. అల్మాస్గూడ ప్రాంతంలో ఓ క్రిస్టియన్ కుటుంబాన్ని కలిసి తిరిగి వస్తున్న ఇద్దరు దళిత మహిళలపై మత మార్పిడులకు పాల్పడుతున్నారనే నెపంతో కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ వివిధ సంఘాలు మీర్పేట్ పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తెలిపాయి. అయితే అక్కడికి చేరుకున్న కొందరు మరోసారి దౌర్జన్యానికి పాల్పడినట్లు సీపీఐ(ఎం) ఆరోపించింది.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమ మతాన్ని విశ్వసించే, ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కును కల్పించిందని సీపీఐ(ఎం) గుర్తుచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను, ఆర్టికల్ 19 భావప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తున్నాయని పేర్కొంది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు పాల్పడటం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.
ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) కోరింది. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత దళిత మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు.
