రియాద్ విమానాశ్రయంపై దాడి.. హైదరాబాద్‌వాసి మృతి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సౌదీ అరేబియాలోని రియాద్ కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడిలో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ యూసుఫ్ (46) మృతి చెందారు. మెహిదీపట్నానికి చెందిన ఆయన.. శనివారం (అక్టోబర్ 10) జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. యూసుఫ్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సియాసత్ వార్తాసంస్థ పేర్కొంది.
రియాద్‌లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న యూసుఫ్ వారం రోజుల క్రితం భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లారు. ఉమ్రా యాత్ర కోసం వెళ్లిన వారు.. రియాద్ నుంచి మదీనాకు ప్రయాణించేందుకు విమానాశ్రయంలో సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చెక్-ఇన్ కియోస్క్ సమీపంలో కుటుంబం ఉన్న సమయంలో ప్రక్షేపకం పడినట్లు ప్రాథమిక సమాచారం. దాని శకలాలు తగలడంతో యూసుఫ్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిసేపు స్పృహలోకి వచ్చినప్పటికీ.. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపినట్లు కథనం పేర్కొంది.
కుమారులకు తీవ్ర గాయాలు..
ఈ ఘటనలో యూసుఫ్ పెద్ద కుమారుడికి మోకాలికి శస్త్రచికిత్స జరుగుతోంది. చిన్న కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడి పాదంలోని మూడు వేళ్లను తొలగించినట్లు సమాచారం. యూసుఫ్ భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నారు. కుటుంబంతో పాటు ప్రయాణిస్తున్న ఆయన పిన్ని తలకు గాయాలయ్యాయి. అయితే ఆమెకు ప్రాణాపాయం తప్పినట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.
కుటుంబానికి సహాయం చేయాలని ఒవైసీ విజ్ఞప్తి…
యూసుఫ్ కుటుంబ పరిస్థితిపై రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ ఉప ప్రధానితో మాట్లాడినట్లు ఒవైసీ తెలిపారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరుతూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కుటుంబానికి సహాయం అందుతోందని, రియాద్‌లో ఉన్న యూసుఫ్ బావతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని పేర్కొన్నారు.
మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు చర్యలు..
రియాద్‌లో జరిగిన దాడిలో గాయపడిన భారతీయుడు మృతి చెందినట్లు భారత రాయబార కార్యాలయం ఆదివారం ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపిన కార్యాలయం.. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వెల్లడించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా యూసుఫ్ మృతిపై విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని తెలిపారు.
12 మంది మృతి.. 309 మందికి గాయాలు..
సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా, మరో 309 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు, ఎనిమిది మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, సౌకర్యాల భద్రతను అధికారులు పరిశీలించారు. ఈ దాడికి హౌతీ ఉద్యమమే కారణమని సౌదీ నేతృత్వంలోని కూటమి ఆరోపించింది. అయితే దాడికి సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.
