బీజేపీ నాయకుడు రవి దంపతులపై దాడి

  • బాధితులను పరామర్శించిన డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి
  • నిందితులపై చర్యలకు ఏసీపీకి వినతి

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం ఇనాయత్ నగర్ గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు రవి, ఆయన భార్యపై దాడి జరిగినట్లు బీజేపీ నాయకులు ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఎలాంటి కారణం లేకుండా వారిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలో రవి తీవ్రంగా గాయపడగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన భార్యకు కూడా గాయాలయ్యాయని బాధిత కుటుంబం పేర్కొంది.

దాడిలో రవి కాలు, చేయి విరగడంతో పాటు తలకు తీవ్ర గాయమైంది. ఆయన భార్య చేతులకు కూడా గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.

అనంతరం ఆర్మూర్ ఏసీపీని కలిసి ఘటనకు బాధ్యులైన వ్యక్తిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రవి దంపతులకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలపై దాడులను సహించబోమని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి, మోర్తాడ్ మండల అధ్యక్షుడు శివానందరెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.