రైల్వే కోడూరులో దారుణం.. పదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..
తిరుపతి టాస్క్ఫోర్స్ (ఆంధ్రప్రభ): అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాధితురాలు ధైర్యంతో తల్లికి విషయం చెప్పడంతో ఈ పాశవిక చర్య బయటపడింది. అయితే, ఈ వ్యవహారంలో మొదట పోలీసులు చూపిన నిర్లక్ష్యంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యం..
బాధితురాలి కథనం ప్రకారం.. సోమవారం రోజున ఇంటి బయట కూర్చుని ఉన్న పదేళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన రమేష్ నాయుడు (45) అనే వ్యక్తి ఆటోలో ఎక్కించుకుని రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్లాడు. ఆపై ఊరి శివార్లకు తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు తీవ్ర భయాందోళనకు గురైన ఆ బాలిక తన తల్లికి ఎదురైన ఘోరాన్ని పూసగుచ్చినట్లు వివరించింది.
పోలీసుల గోప్యతపై అనుమానాలు..
చిన్నారి వాంగ్మూలంతో నిర్ఘాంతపోయిన తల్లి వెంటనే రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే, ఈ సున్నితమైన కేసును తొలుత కప్పిపుచ్చేందుకు, సమాచారం బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు ప్రయత్నించారనే బలమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, ఘటన తీవ్రతను దృష్ట్యా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ చేపడుతున్నారు.
