మనకెవరికైనా డబ్బు అవసరం పడ్తే ఏం చేస్తాం? మన దగ్గర్లోని ఏటీఎంకి వెళ్ళి, కార్డు పెట్టి, పిన్ ఎంటర్ చేసి కావలసిన డబ్బు డ్రా చేస్తాం. ఆ ఏటీఎంలో ఉన్న, మన అకౌంట్ లో అందుబాటులో ఉన్న నిల్వను బట్టి డబ్బు డ్రా అవుతుంది. కానీ ఈ ప్రబుద్దులకు ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేయాలంటే ఇవేమీ అవసరం లేదు. వాళ్ళ పనిముట్లు వాళ్లకుంటాయి. వాటిని ఉపయోగించి ఎంచక్కా ఏటీఎంల నుంచి డబ్బును ఊడ్చేస్తున్నారు. ఈ ఏటీఎం దొంగల కథా కమామిషూ తెలియాలంటే పూర్తి వవరాలు చదవండి…
Read Also… https://prabhanews.com/gold-robbery-in-mangalagiri/
గ్యాస్ కట్టర్లతో లాకర్స్ పగల కొట్టి రూ.14 లక్షలతో ఉడాయింపు..
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలో దొంగల ముఠా రెచ్చిపోయి ఎస్ బి ఐ ఏటీఎంకు భారీ మొత్తంలో కన్నం వేసి ఊడాయించిన ఘటన కలకలం రేపింది. ఆదిలాబాద్ పట్టణం రాంనగర్ కాలనీ (Ramnagar Colony) ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎస్ బిఐ బ్యాంకు ప్రాంగణంలోని ఏటీఎం (ATM) లో శనివారం ఉదయం దొంగల ముఠా చొరబడి తమ ఆనవాళ్లు చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా సిసి కెమెరాల (CC cameras) కు బ్లాక్ స్ప్రే కొట్టి ఆ తర్వాత గ్యాస్ కట్టర్ల సాయంతో లాకర్ ను చాకచక్యంగా పగలగొట్టి అందులో నిల్వ ఉన్న రూ. 14లక్షల నగదుతో ఉడాయించారు. ఏటీఎంలలో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా అతి తెలివిగా వ్యవహరించి దొంగతనం చేసి పారిపోయినట్టు తెలుస్తోంది.
బ్యాంకులకు నాలుగో శనివారం సెలవు దినం, మరుసటి రోజు ఆదివారం రావడంతో ఏటీఎంలో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేస్తారని భావించి దొంగల గ్యాంగ్ పథకం ప్రకారమే ఏటీఎంకు కన్నం వేసినట్టు తెలుస్తోంది. అక్కడ బ్యాంకు, ఎటిఎం ఉన్నప్పటికీ వాచ్ మెన్ లేకపోవడం చోరీ జరగడానికి కారణమని తెలుస్తోంది. ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కర్రే స్వామి, టూ టౌన్ సీఐ కరుణాకర్, మావల ఎస్ఐ అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఏటీఎంకు కన్నం వేయడం ఇది రెండోసారి.. ఆదిలాబాద్ పట్టణ నడిబొడ్డున సరిగ్గా నాలుగేళ్ల కిందట బీహార్ రాష్ట్రానికి చెందిన దొంగల ముఠా ఒక జువెలరీ షాప్ కు, మరో ఏటీఎంలో చొరబడి రూ.20 లక్షల నగదును దోచుకెళ్లారు. అప్పట్లో ఈ చోరీ ఘటన సంచలనం రేపింది. ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను పట్టుకుంటామని డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.