గిద్దలూరు వేంకటేశ్వర స్వామి ఆలయంలో..
గిద్దలూరు: అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ) : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణములోని రాచర్ల రోడ్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గురువారం రాత్రి భారీ చోరి జరిగింది. ఈ సంఘటనలో వేంకటేశ్వర ఈ సంఘటనలోస్వామి విగ్రహానికి అలంకరించిన 15 కిలోల వెండి ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. వీటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం ఇనుప తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి వెండి ఆభరణాలను దోచుకెళ్లారు శుక్రవారం ఉదయం దేవాలయానికి వెళ్లిన వాచ్మెన్ దేవాలయ తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి లోనికి వెళ్లి చూడగా వేంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉండవలసిన ఆభరణాలు కల్పించలేదు. దీంతో వాచ్మెన్ దేవాలయ కమిటీ నిర్వాహకులకు సమాచారం అందించారు.
నిర్వాహకులు దేవాలయానికి చేరుకొని జరిగిన సంఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే గిద్దలూరు పోలీసులు దేవాలయానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. చోరీ జరిగిన ఆభరణాలకు సంబంధించిన వివరాలను నిర్వాహకులతో అడిగి తెలుసుకున్నారు. గుడిలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకుండా కనెకషన్లు కట్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి చోరికి పాల్పడినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో పోలీసులకు ఆధారాలు లభించ లేదు. దేవాలయం సమీపంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో రాచర్ల గేటు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. భారీగా వెండి ఆభరణాలు అపహరణకు గురి కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వేలిముద్రలు సేకరించే క్లూస్ స్కీమ్ తో పాటు జాగిలాన్ని రప్పిస్తున్నారు. దేవాలయంలో విలువగల 15 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురికావడం పోలీసులకు సవాల్ గా మారింది.

