సాగునీటి సమస్య పరిష్కారానికి మంత్రి సీతక్క హామీ

లక్నవరం జలాశయం నుంచి శుక్రవారం నీటిని విడుదల చేస్తామని భరోసా

ములుగు జిల్లా, గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : గోవిందరావుపేట మండలంలోని రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మండల కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి సీతక్క ను, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ను కలిసి రైతుల సాగునీటి అవసరాలను వివరించారు.

ప్రస్తుతం సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో లక్నవరం జలాశయం నుంచి రైతులకు సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ వారికి మెమొరాండం అందజేశారు. రైతుల ఇబ్బందులను సానుకూలంగా విన్న మంత్రి సీతక్క వెంటనే స్పందిస్తూ, శుక్రవారం లక్నవరం జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయిస్తామని, రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అదేవిధంగా గోవిందరావుపేట మండల రైతులకు శాశ్వతంగా సాగునీటి సమస్య లేకుండా చేసేందుకు లక్నవరం జలాశయానికి గోదావరి జలాలను తీసుకురావడానికి రూ.33 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ఈ పనులు పూర్తయితే రాబోయే రోజుల్లో గోవిందరావుపేట మండల రైతులకు సాగునీటి కొరత ఉండదని స్పష్టం చేశారు.

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల అవసరాలను గుర్తించి సాగునీరు, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నాయకులు తెలిపారు. రైతుల సమస్యను మంత్రి సీతక్క వెంటనే పరిష్కరించేందుకు హామీ ఇవ్వడం పట్ల గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.“రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం… రైతు పంటకు నీరందించే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం” అని మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.