జిమ్‌కు భరోసా.. యోగ కేంద్రానికి కొనసాగింపు

–మంత్రి టీజీ భరత్‌ జోక్యంతో సమస్యకు పరిష్కార మార్గం
-జిమ్‌తోపాటు యోగ కేంద్రం కొనసాగించాలి.. షాప్ అధికారికి ఆదేశం
-క్రీడాకారుల వసతికి షాప్ భవనాలను వినియోగించుకోవాలని సూచన

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలోని అవుట్‌డోర్‌ స్టేడియంలో వ్యాయామశాల ఆకస్మిక మూసివేతతో తలెత్తిన వివాదానికి తెరదించే దిశగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ స్పందించారు. వ్యాయామశాల నిర్వహణ, క్రీడాకారుల సౌకర్యాలపై క్రీడాకారులతో స్వయంగా మాట్లాడిన ఆయన.. సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్రీడాకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిమ్‌తోపాటు యోగ కేంద్రాన్ని కూడా కొనసాగించాలని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధికారులను ఆదేశించారు.

ఇటీవల డీఎస్‌డీవో ఆదేశాల మేరకు అవుట్‌డోర్‌ స్టేడియంలోని వ్యాయామశాలను ఆకస్మికంగా మూసివేయడంతో క్రీడాకారులు, వ్యాయామ ప్రియులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి టీజీ భరత్‌ జిమ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. జిమ్‌ను వినియోగిస్తున్న వారితో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.

జిమ్‌తోపాటు యోగ కేంద్రం

వ్యాయామంతో పాటు యోగ సాధన కూడా ప్రజల ఆరోగ్యానికి ఉపయోగకరమని పేర్కొంటూ జిమ్‌తోపాటు యోగ కేంద్రాన్ని కూడా కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు, క్రీడాకారులు నిరంతరం వినియోగించుకునే సదుపాయాలను ఒక్కసారిగా నిలిపివేయకుండా అవసరమైన విధంగా నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత షాప్ అధికారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

క్రీడాకారులకు వసతి కల్పించాలి

స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా మంత్రి దృష్టి సారించారు. షాప్‌కు కేటాయించిన భవనాలను ఇతర అవసరాలకు మాత్రమే పరిమితం చేయకుండా క్రీడాకారుల వసతి గృహాలుగా వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి శిక్షణ కోసం వచ్చే క్రీడాకారులకు వసతి కల్పిస్తే స్టేడియం మరింత ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు.

అభివృద్ధిపై విస్తృత ప్రచారం

కర్నూలు అవుట్‌డోర్‌ స్టేడియంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని మంత్రి సూచించారు. స్టేడియంలో అందుబాటులో ఉన్న క్రీడా సదుపాయాలు, జిమ్‌, యోగ కేంద్రం తదితర అంశాలపై క్రీడాకారులు కూడా సానుకూలంగా ప్రచారం చేయాలని కోరారు. అదే సమయంలో వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు ప్రచారాలు నిర్వహించవద్దని సూచించారు.

సమస్యలు ఉంటే నేరుగా చెప్పండి

జిమ్‌, క్రీడా సదుపాయాల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని మంత్రి టీజీ భరత్‌ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. సమస్యలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. స్టేడియం అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు.

ఇటీవల జిమ్‌ మూసివేతపై క్రీడాకారుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో మంత్రి స్వయంగా జిమ్‌ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమస్యపై వివాదం కొనసాగకుండా జిమ్‌, యోగ కేంద్రాల నిర్వహణకు స్పష్టత ఇవ్వడంతో పాటు క్రీడాకారుల వసతి, స్టేడియం అభివృద్ధి వంటి అంశాలను కూడా మంత్రి ప్రస్తావించడం ద్వారా సమగ్ర పరిష్కారంపై దృష్టి సారించినట్లయింది.

కార్యక్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.రంగా రవికుమార్‌, భవాని, మధు, అస్లాం, రాజగోపాల్‌, వెంకటేశ్వర్లు, నాగరాజు, ప్రభాకర్‌, డేవిడ్‌, గోపాల్‌రెడ్డి (డ్రెస్‌ సర్కిల్‌), ముత్తు, ఆదినారాయణ, వెంకటేష్‌ (పీ.ఈ.టీ), శివప్రసాద్‌, శ్రీనివాసులు, కురుమూర్తి, బుల్లెట్‌ హరి, రాజశేఖర్‌, రమేష్‌, హైదర్‌, మహబూబ్‌, మల్లికార్జునరెడ్డి, వెంకటేష్‌, శేఖర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, సత్యనారాయణరెడ్డి, కెప్టెన్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.