Assembly-tlg-hyd |తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై వేటు
Assembly-tlg-hyd |తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై వేటు
శాసన మండలిలో సంచలన నిర్ణయం… అసెంబ్లీలో తారస్థాయికి రాజకీయ వేడి
Assembly-tlg-hyd | ఆంధ్రప్రభ వెబ్, అంసెబ్లీ ప్రతినిధి : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల రెండో రోజు రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం అసెంబ్లీని దాటి శాసనమండలినీ కుదిపేసింది. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పీఠాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడాన్ని అధికారపక్ష సభ్యులు తీవ్రంగా తప్పుబట్టగా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. చివరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ మద్దతు లభించగా.. దాని ఆధారంగా తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను ప్రస్తుత శాసనమండలి సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.
వ్యాఖ్యలతో మొదలై.. చర్యల దాకా
సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలు మంగళవారం శాసనమండలిలో ప్రధాన చర్చగా మారాయి. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత విమర్శలు కావని, రాజ్యాంగబద్ధమైన సభాపతి పీఠాన్ని అవమానించడమేనని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలు సహజమే అయినప్పటికీ.. సభాపతులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించే సంస్కృతికి చట్టసభల్లో స్థానం ఉండకూడదని అధికారపక్ష సభ్యులు స్పష్టం చేశారు.
సీతక్క తీవ్ర ఆగ్రహం
మంత్రి దనసరి అనసూయ(సీతక్క) తాతా మధు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌ను మాత్రమే కాకుండా ఆయన మాతృమూర్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల భాష కూడా అభ్యంతరకరంగా ఉందన్నారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండటాన్ని సహించలేని ధోరణి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన శాసనమండలి సభ్యత్వంపైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మల్లన్న ఘాటు వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఒక దళిత బిడ్డ స్పీకర్ పీఠంపై కూర్చోవడాన్ని ఓర్చుకోలేకపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. స్పీకర్‌ను అవమానించడం అంటే ఒక్క వ్యక్తిని అవమానించడం కాదని, దళిత, బహుజన సమాజంతో పాటు రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమేనని అన్నారు. గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్ వైఖరిపై విమర్శలు గుప్పించారు.
‘స్పీకర్ పీఠానికే రక్షణ లేకపోతే?’
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. స్పీకర్ పీఠానికే రక్షణ లేకపోతే సాధారణ సభ్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సభా పీఠం గౌరవాన్ని కాపాడకపోతే చట్టసభలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. సభకు ఉన్న అధికారాలను ఉపయోగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మహేశ్‌కుమార్ గౌడ్ నేరుగా కేసీఆర్‌పై గురి
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఈ వివాదాన్ని మరింత రాజకీయ కోణంలోకి తీసుకెళ్లారు. తాతా మధు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి కావని, కేసీఆర్ ప్రోద్బలంతోనే చేశారని ఆరోపించారు. స్పీకర్ ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదని.. మొత్తం సభకు ప్రతినిధి అని అన్నారు. దళిత నాయకుడు స్పీకర్‌గా ఉండటాన్ని బీఆర్‌ఎస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. తాతా మధును సస్పెండ్ చేయాలని మండలి చైర్మన్‌ను కోరారు.
అసెంబ్లీలోనూ అదే సెగ
ఇదే సమయంలో అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మహిళా సభ్యులపై జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల చర్యలపై చర్చకు పట్టుబట్టారు. హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ సభ్యులు వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేయగా.. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ కోరారు. బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావును ఉద్దేశించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఘాటుగా స్పందించారు. తన తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తనకే బాధ ఉంటుందని, ఇతరులు ఆవేశపడాల్సిన అవసరం లేదని అన్నారు. సభను పదేపదే అడ్డుకోవడం సరికాదని హెచ్చరించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే నివేదిక కోరామని, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని స్పష్టం చేశారు. అన్ని పక్షాలను సమానంగా చూస్తున్నానని, ఇకపై సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తే మైక్ కూడా ఇవ్వబోనని హెచ్చరించారు.
కేటీఆర్ ఎదురుదాడి
మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పరిస్థితులు రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
కేసీఆర్ నివాసం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్‌ఎస్ భయపడదని, ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలోనూ ప్రజాక్షేత్రంలోనూ ప్రశ్నిస్తామని ప్రకటించారు. దళిత డిక్లరేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏకగ్రీవ తీర్మానం.. ఇద్దరిపై వేటు
వివాదం చివరకు క్రమశిక్షణ చర్యలకు దారితీసింది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ స్థానం ఏ ఒక్క కులానికో, మతానికో చెందినది కాదని, రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నతమైన పీఠమని ఆయన స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు. అనంతరం అసెంబ్లీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానం కాపీని శాసనమండలి చైర్మన్‌కు పంపించారు. దానిని పరిశీలించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను ప్రస్తుత సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అక్బరుద్దీన్ స్పందన
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల చర్యలను ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షానికి చెందిన వారైనా వారు తన తోటి శాసనసభ్యులేనని, మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. అదే సమయంలో సభలో నిరసనలకు సంబంధించిన నిబంధనల అమలుపైనా అక్బరుద్దీన్ ప్రశ్నలు లేవనెత్తారు. బీఆర్‌ఎస్ సభ్యులకు రాతలున్న టీషర్టులతో సభకు అనుమతి నిరాకరిస్తే.. బీజేపీ సభ్యులకు ప్లకార్డులతో నిరసనకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
రాజకీయ పోరాటం.. సభా గౌరవం మధ్య సరిహద్దు ఎక్కడ?
తాతా మధు వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు కేవలం వ్యక్తిగత విమర్శల అంశంగా మిగలలేదు. ఇది స్పీకర్ పీఠం గౌరవం, చట్టసభల సంప్రదాయాలు, ప్రతిపక్ష నిరసనల హక్కు, అధికారపక్షం వ్యవహారశైలి, మహిళా ఎమ్మెల్యేల భద్రత వంటి అనేక అంశాలను ఒకేసారి తెరపైకి తెచ్చింది. ఒకవైపు సభాపతి పీఠం గౌరవాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని అధికారపక్షం వాదిస్తోంది. మరోవైపు ప్రతిపక్షం తమపై రాజకీయ ఒత్తిళ్లు, పోలీసుల చర్యలు, సభలో తమకు మాట్లాడే అవకాశం లేకపోవడాన్ని ప్రశ్నిస్తోంది. అక్బరుద్దీన్ వంటి మూడో పక్ష నేతల స్పందనతో ఈ వివాదం మరింత విస్తృత రాజకీయ చర్చగా మారింది. మొత్తంగా చూస్తే.. తాతా మధు వ్యాఖ్యల వివాదం బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్య ఇప్పటికే ఉన్న రాజకీయ వైరం మరింత ముదిరేలా చేసింది. అసెంబ్లీలో తీర్మానం, మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్‌తో వ్యవహారం క్రమశిక్షణా చర్యల దశకు చేరింది. ఇక ముందు ఈ పరిణామం రాజకీయంగా ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? సభా కార్యక్రమాలు మరింత వేడెక్కుతాయా? మహిళా ఎమ్మెల్యేల వ్యవహారంపై కోరిన నివేదికలో ఏమి తేలుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
