Assembly-Hyd-Fourth Day | పాల నుంచి ఆర్టీసీ దాకా.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై హీట్‌!

  • కూరగాయల సాగు కుదింపు.. 92 శాతం పాలు ఇతర రాష్ట్రాల నుంచే
  • రైతు మార్కెట్లకు మౌలిక వసతుల కొరత.. ఫ్లోటింగ్‌ సోలార్‌పై సర్కారు దృష్టి
  • టీజీఎస్‌ఆర్టీసీకి 2,932 కొత్త బస్సులు.. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.240 కోట్ల కార్పస్‌
  • శాసన మండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌
  • శాస‌న‌స‌భ రేపు ఉద‌యం ప‌ది గంట‌ల‌కు వాయిదా

Assembly-Hyd-Fourth Day | ఆంధ్రప్రభ వెబ్‌, అసెంబ్లీ ప్రతినిధి : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో గురువారం ప్రజల నిత్యజీవితంతో ముడిపడిన పలు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వ్యవసాయం, కూరగాయల సాగు, పాల ఉత్పత్తి, రైతుబజార్లు, విద్యుత్‌, ఆర్టీసీ, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చాయి. ప్రభుత్వ చర్యలు, భవిష్యత్‌ ప్రణాళికలపై మంత్రులు వివరణ ఇచ్చారు. మరోవైపు శాసన మండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యులు వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ తిరస్కరించడంతో వాకౌట్‌ చేశారు. శాసనసభను శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.

కూరగాయల సాగు ఎందుకు తగ్గింది?

కూరగాయలు, పండ్ల సాగులో పురుగుమందుల వినియోగంపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సభలో ఆందోళన వ్యక్తం చేశారు. పురుగుమందుల వినియోగాన్ని నియంత్రించడంతో పాటు ఆహార భద్రత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానమిస్తూ.. పురుగుమందుల అధిక వినియోగం వల్ల తెలంగాణలో ఉత్పత్తయ్యే కూరగాయలు, పండ్లను ఇతర దేశాలు తిరస్కరిస్తున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. భూమి సంరక్షణకు ఉపయోగపడే ఎరువులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలని గతంలోనే కోరినట్లు చెప్పారు.

అయితే ఈ చర్చలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయిందని మంత్రి వెల్లడించారు. ఒకప్పుడు సుమారు 3 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగు కాగా.. ప్రస్తుతం అది 50 వేల ఎకరాలకు పడిపోయిందని తెలిపారు. సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, వివిధ కార్యక్రమాలు కూడా పంటల ఎంపికపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు.

తెలంగాణకు పాలు.. పొరుగు రాష్ట్రాలపై ఆధారం

రాష్ట్రంలో పాల ఉత్పత్తి పరిస్థితిపైనా సభలో ఆందోళన వ్యక్తమైంది. తెలంగాణ అవసరాల్లో కేవలం ఎనిమిది శాతం పాలు మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయని, మిగిలిన 92 శాతం పాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ తెలిపారు.

పాల కల్తీ, నకిలీ పాల సమస్యలను ప్రస్తావించిన ఆయన.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ఈ చర్చ స్పష్టం చేసింది.

కూరగాయల ధరలకు దిగుమతుల ప్రభావం

రాష్ట్ర అవసరాలకు సరిపడా కూరగాయల సాగు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని బీజేపీ ఎమ్మెల్యే కె. వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకురావడం వల్ల రవాణా వ్యయం పెరిగి.. చివరకు ఆ భారం వినియోగదారులపై పడుతోందని తెలిపారు. కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు కల్పించాలని కోరారు.

మార్కెట్లలో మౌలిక వసతుల కొరత

హైదరాబాద్‌లోని కూరగాయలు, పండ్ల మార్కెట్ల సమస్యలపై కూడా సభ్యులు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు విశ్రాంతి గదులు, క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌ కోరారు. మార్కెట్‌లో రాకపోకలకు కూడా స్థలం తగ్గిపోతోందని, అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దుకాణాలకు లైసెన్సులు ఇస్తున్నారని తెలిపారు.

మెహదీపట్నం రైతుబజార్‌లో పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కాంప్లెక్స్‌ నిర్మించాలని కోరారు. మాదన్నపేట కూరగాయల మార్కెట్‌ అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఫలక్‌నుమా రైతుబజార్‌లో మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలు కూడా సభలో ప్రస్తావనకు వచ్చాయి. పహాడీషరీఫ్‌లో పండ్ల వ్యాపారానికి తాత్కాలిక లైసెన్స్‌ ఇవ్వాలని సభ్యులు కోరారు. మార్కెట్ల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కార మార్గాలను పరిశీలిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు.

ఆర్టీసీకి కొత్త ఊపు.. 2,932 బస్సులు

తెలంగాణ ప్రజా రవాణాలో కీలకమైన టీజీఎస్‌ఆర్టీసీపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నియోజకవర్గాల వారీగా బస్సుల అవసరాలపై ప్రజాప్రతినిధుల నుంచి ఇప్పటికే వివరాలు సేకరించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.12,171 కోట్ల మేర ఆదా జరిగిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో మినీ ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నామని, నగరంలో ఇప్పటికే 540 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు.

బస్సుల్లో సీసీ కెమెరాలపై..

అన్ని ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రణాళిక ప్రస్తుతం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అయితే ప్రీమియం ఫ్లీట్‌, ఎలక్ట్రిక్‌ బస్సుల్లో సంస్థ సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు. అవసరాన్ని బట్టి ఇతర బస్సుల్లోనూ ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. ఆదిలాబాద్‌లో జిల్లా ఎస్పీ సమన్వయంతో కొన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ డిపోల్లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వంగపల్లి వద్ద ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవడం, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డిపోల సమస్యల పరిష్కారం, మిర్యాలగూడలో కొత్త డిపో ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి సారించినట్లు చెప్పారు.

ఫ్లోటింగ్‌ సోలార్‌.. భారీ విద్యుత్‌ డిమాండ్‌కు పరిష్కారమా?

రిజర్వాయర్లపై తేలియాడే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం సహా పలు రిజర్వాయర్లను పరిశీలిస్తున్నామని, విద్యుత్‌, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. అయితే ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టులకు అధిక వ్యయం ప్రధాన సవాలుగా ఉందని భట్టి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా ఒక్క మెగావాట్‌కు రూ.1.30 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. నిబంధనలు సడలిస్తే పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ ప్రస్తుతం 19 వేల మెగావాట్లకు చేరిందని, పారిశ్రామిక వృద్ధితో అది మరింత పెరుగుతోందని వివరించారు. విద్యుత్‌ సబ్సిడీల కోసం ఏటా రూ.19 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

గ్రామాలకూ సోలార్‌ విద్యుత్‌

సోలార్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని భట్టి తెలిపారు. అమ్రాబాద్‌లో 80 గ్రామాలను సోలరైజేషన్‌ చేసే పైలట్‌ ప్రాజెక్టును చేపడుతున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో మైక్రో గ్రిడ్‌ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు, ప్రజలు సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని, ఎమ్మెల్యేలు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

కార్మికుల కనీస వేతనాలపై ప్రభుత్వం దృష్టి

కనీస వేతనాల చెల్లింపులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నదీమ్‌ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, త్వరలో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

కొత్త హజ్‌హౌస్‌కు రూ.86.5 కోట్లు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మామిడిపల్లిలో కొత్త హజ్‌హౌస్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.86.5 కోట్ల అంచనా వ్యయం ప్రతిపాదించింది. రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త భవనానికి రూపకల్పన కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్‌లను సంప్రదిస్తున్నామని, బెంగళూరులోని హజ్‌హౌస్‌ నమూనాను పరిశీలించినట్లు చెప్పారు. అయితే నిధుల మంజూరు ఇంకా జరగలేదని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్‌ అజహరుద్దీన్‌ తెలిపారు. నిధుల మంజూరు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.240 కోట్ల కార్పస్‌

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం రూ.240 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. ఉద్యోగులకు రూ.1 కోటి ప్రమాద బీమా సదుపాయాన్ని కూడా అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

మండలిలో బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

ఇదిలా ఉండగా.. తెలంగాణ శాసన మండలిలో గురువారం ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. మండలి ప్రారంభమైన వెంటనే 22ఎపై చర్చించాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ఇందుకోసం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను శాసనమండలి చైర్మన్‌ తిరస్కరించడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లారు. దీంతో శాసనసభతో పాటు మండలిలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి కొనసాగింది.

అసెంబ్లీ చర్చల్లో కనిపించిన అసలు చిత్రం

గురువారం సభలో జరిగిన చర్చలను పరిశీలిస్తే.. తెలంగాణలో ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే పలు రంగాల్లో ఉన్న సవాళ్లు ఒకేసారి తెరపైకి వచ్చాయి. ఒకవైపు కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడం, పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి లేకపోవడం, ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం ధరలపై ప్రభావం చూపుతున్న అంశాలను సభ్యులు ప్రస్తావించారు. మరోవైపు మార్కెట్ల మౌలిక వసతులు, రైతులకు అవసరమైన సదుపాయాలు కూడా చర్చకు వచ్చాయి.

ఇక పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఫ్లోటింగ్‌ సోలార్‌, పంప్డ్‌ స్టోరేజ్‌, గ్రామీణ సోలరైజేషన్‌ వంటి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం మరో కీలక అంశంగా నిలిచింది. ప్రజా రవాణా రంగంలో కొత్త బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్‌ బస్సుల విస్తరణ, భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రైతు పంట నుంచి వినియోగదారుడి మార్కెట్‌ వరకు, పాల ఉత్పత్తి నుంచి ప్రజా రవాణా వరకు.. తెలంగాణలో మౌలిక అవసరాలు, సేవల సామర్థ్యం, స్వయం సమృద్ధి, ప్రజా సంక్షేమం చుట్టూనే గురువారం అసెంబ్లీ చర్చలు సాగాయి. శుక్రవారం సమావేశాల్లో ఈ అంశాలపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వడంతో పాటు ప్రతిపక్షాల నుంచి మరిన్ని ప్రశ్నలు, రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఉంది.