Asian Games 2026 | భారత్ అదుర్స్… 85 పతకాల హారం !
- 21 స్వర్ణాల మెరుపులు
- డే-1లో షూటింగ్ తో మొదలై..
- ఐదు స్వర్ణాలతో ముగిసిన భారత ప్రస్థానం
- రికార్డులు.. డబుల్ గోల్డ్.. చరిత్రకే చరిత్ర..
(నాగోయా, ఆంధ్రప్రభ క్రీడాప్రతినిధి) : ఐచి-నాగోయాలో రెండు వారాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన 20వ Asian Games 2026 లో భారత్ అదరగొట్టింది. సెప్టెంబర్ 20న తొలి రోజు షూటింగ్ రజత పతకాలతో ఖాతా తెరిచిన భారత్.. అక్టోబర్ 3న చివరి రోజు ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో పతకాల వేటను ఘనంగా ముగించింది. మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో 85 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చివరి రెండు రోజుల్లోనే భారత్ 11 స్వర్ణాలు సాధించడం ఈ క్రీడల ముగింపులో కీలక మలుపుగా నిలిచింది.
ముగింపు వేడుకలకు నాగోయా సిద్ధం
ఇక రేపు, అక్టోబర్ 4న ఐచి–నాగోయా ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుకలు నాగోయాలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు వేడుకలు నిర్వహించనున్నారు. క్రీడాకారుల పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆసియా క్రీడల జ్యోతి ఆర్పివేయడం, తదుపరి ఆతిథ్య దేశానికి అధికారికంగా బాధ్యతల అప్పగింత వంటి కార్యక్రమాలు ఉంటాయి. 2030 ఆసియా క్రీడలకు దోహా ఆతిథ్యం ఇవ్వనుంది. ముగింపు వేడుకలో షూటర్ నీరు దండా భారతదేశ పతాకధారిగా వ్యవహరిస్తారు. ఈ క్రీడల్లో ఆమె రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో ఆసియా క్రీడల స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా నిలిచిన నీరూ ధండాకు ఈ గౌరవం దక్కింది.
తొలి రోజు.. షూటింగ్‌తో ఖాతా ప్రారంభం
భారత్ ఖాతా తెరిచింది షూటింగ్‌తోనే. సెప్టెంబర్ 20న మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించింది. అదే విభాగం టీమ్ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదర్సా వినోద్ రజతం అందించారు. దీంతో తొలి రోజే భారత్ రెండు రజతాలు సాధించింది.
సెప్టెంబర్ 21న.. రెండో రోజు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో హిమాంశు ధిల్లాన్ రజతం, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించారు. పురుషుల టీమ్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్, పార్థ్ మానే, హిమాంశు ధిల్లాన్ రజతం అందించారు. మహిళల సంప్రదాయ ఎంఎంఏ 60 కిలోల విభాగంలో సూచికా తారియాల్ కాంస్యం గెలిచింది. రెండో రోజు భారత్ నాలుగు పతకాలు ఖాతాలో వేసుకుంది.
అయితే, మూడో రోజు.. సెప్టెంబర్ 22న భారత్ తొలి స్వర్ణాన్ని అందుకుంది. మహిళల టీ20 క్రికెట్ ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించిన భారత మహిళల జట్టు స్వర్ణం గెలిచింది. భారత్ 3 వికెట్లకు 216 పరుగులు చేయగా, శ్రీలంక 69 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన 45 బంతుల్లో 79 పరుగులతో మెరిసింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీసింది. ఈ విజయంతో భారత్ స్వర్ణాల ఖాతా తెరిచింది.
సెప్టెంబర్ 23న నాలుగో రోజు షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, సాఫ్ట్ టెన్నిస్, స్కీట్ విభాగాల్లో పతకాలు వచ్చాయి. మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం సాధించింది. పురుషుల టీమ్ బ్యాడ్మింటన్‌లో భారత్ కాంస్యం గెలిచింది. పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్‌లో జే మీనా కాంస్యం సాధించాడు. మహిళల స్కీట్ టీమ్‌లో పరినాజ్ ధాలివాల్, రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ కాంస్యం సాధించగా.. పురుషుల స్కీట్ టీమ్‌లో అనంత్‌జీత్ సింగ్ నరూకా, భవ్‌తేజ్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్ కాంస్యం అందించారు.
సెప్టెంబర్ 24న ఐదో రోజు వుషులో మహిళల 60 కిలోల సాండా విభాగంలో నారెమ్ రోషిబినా దేవి రజతం సాధించింది. మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలో భారత్‌కు రజతం దక్కింది. మహిళల 10 వేల మీటర్ల పరుగులో సీమా కుమారి కాంస్యం, పురుషుల డబుల్ స్కల్స్ రోయింగ్‌లో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్యం, మిక్స్‌డ్ స్కీట్‌లో అనంత్‌జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలివాల్ కాంస్యం సాధించారు. రోషిబినా వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళా వుషు క్రీడాకారిణుల్లో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఆరో రోజు.. పతకాల వేటలో వేగం
సెప్టెంబర్ 25న ఆరో రోజు భారత్ పతకాల వేట మరింత వేగం పుంజుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో కమల్‌జీత్, సురుచి సింగ్ స్వర్ణం గెలిచారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్‌లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నిరజ్ కుమార్ రజతం సాధించారు. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ రజతం అందుకున్నాడు. మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్, మహిళల పోల్‌వాల్ట్‌లో బరానికా ఎలంగోవన్ కాంస్యాలు సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ టేబుల్ టెన్నిస్‌లో దియా చితాలే, మనుష్ షా కాంస్యం గెలిచారు.
సెప్టెంబర్ 26న… ఏడో రోజున భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మహిళల కబడ్డీ ఫైనల్లో ఇరాన్‌ను 37-34తో ఓడించిన భారత్ స్వర్ణం గెలిచింది. పురుషుల కబడ్డీ ఫైనల్లోనూ ఇరాన్‌ను 40-34తో ఓడించి స్వర్ణం సాధించింది. ఒకే రోజు పురుషులు, మహిళల కబడ్డీ జట్లు స్వర్ణాలు సాధించడం భారత్‌కు డబుల్ గోల్డ్‌గా నిలిచింది. పురుషుల మారథాన్‌లో సావన్ బర్వాల్ రజతం, షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తూర్ రజతం, మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్‌లో ఆశి చౌక్సే, తిలోత్తమ సేన్, విదర్సా వినోద్ రజతాలు సాధించారు. మహిళల 400 మీటర్లలో ప్రాచీ చౌధరి, మిక్స్‌డ్ డబుల్స్ స్క్వాష్‌లో జోష్నా చిన్నప్ప-వేలవన్ సెంథిల్‌కుమార్ కాంస్యాలు అందించారు.
సెప్టెంబర్ 27న ఎనిమిదో రోజు స్క్వాష్, అథ్లెటిక్స్ పతకాలు వచ్చాయి. మహిళల లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్ రజతం, పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుషారే రజతం సాధించారు. మహిళల సింగిల్స్ స్క్వాష్‌లో అనాహత్ సింగ్, పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్ రజతాలు గెలిచారు. డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్, మహిళల 200 మీటర్లలో హరితా భద్ర, మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్ చౌధరి కాంస్యాలు సాధించారు. అనాహత్ సింగ్ ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళగా మరో ప్రత్యేక ఘనత సాధించింది.
సెప్టెంబర్ 28న తొమ్మిదో రోజు భారత్‌కు నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలు వచ్చాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో ఈషా సింగ్ రజతం, పురుషుల లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజతం, పురుషుల 1500 మీటర్లలో గుల్వీర్ సింగ్ రజతం, పురుషుల జావెలిన్‌లో యశ్‌వీర్ సింగ్ రజతం సాధించారు. పురుషుల జావెలిన్‌లో రోహిత్ యాదవ్, మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విథ్యా రామరాజ్, మహిళల 5000 మీటర్లలో పారుల్ చౌధరి, మహిళల -78 కిలోల కురాష్‌లో పింకీ బల్హారా కాంస్యాలు గెలిచారు.
విథ్య రామ్‌రాజ్ 54.75 సెకన్ల సమయంతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. దీంతో 42 ఏళ్లుగా కొనసాగుతున్న పి.టి. ఉష 55.42 సెకన్ల జాతీయ రికార్డును ఆమె అధిగమించారు. ఈ రికార్డ్ ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెటిక్స్ చరిత్రలో గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది.
పదో రోజు.. నీరూ ధాండా, రిలే జట్ల స్వర్ణాలు
సెప్టెంబర్ 29న పదో రోజు భారత్ రెండు స్వర్ణాలతో పాటు ఐదు కాంస్యాలు సాధించింది. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో నీరూ ధాండా స్వర్ణం గెలిచింది. మహిళల 4×400 మీటర్ల రిలేలో కిరణ్ పహల్, పూవమ్మ ఎం.ఆర్, ప్రాచీ చౌధరి, విథ్యా రామరాజ్ స్వర్ణం సాధించారు. మహిళల ట్రాప్ టీమ్‌లో నీరూ ధాండా, మనీషా కీర్, ఆశిమా అహ్లావత్ రజతం గెలిచారు. మహిళల హైజంప్‌లో పూజా సింగ్, మిక్స్‌డ్ 4×100 రిలేలో గురిందర్‌వీర్ సింగ్, స్నేహ ఎస్‌ఎస్, అనిమేశ్ కుజూర్, హరితా భద్ర, పురుషుల 5000 మీటర్లలో గుల్వీర్ సింగ్, పురుషుల 4×400 రిలేలో ధర్మవీర్ చౌధరి, మను టీఎస్, జే కుమార్, విశాల్ టీకే, పురుషుల +90 కిలోల బాక్సింగ్‌లో నరేందర్ బెర్వాల్ కాంస్యాలు సాధించారు.
అదే సమయంలో, గుల్వీర్ సింగ్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించారు. ఒకే ఆసియా క్రీడల్లో ఆయన మూడు వ్యక్తిగత పతకాలను (10,000 మీటర్ల పరుగులో రజతం, 1,500 మీటర్లలో రజతం, 5,000 మీటర్లలో కాంస్యం) సాధించారు. ఒకే ఎడిషన్‌లో మూడు మిడిల్, లాంగ్ డిస్టెన్స్ పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా అతని ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.
సెప్టెంబర్ 30న 11వ రోజు భారత్ నాలుగు స్వర్ణాలు, మూడు కాంస్యాలు సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్‌లో జ్యోతి సురేఖ వెంకం, పృథికా ప్రదీప్, చికితా తానిపర్తి స్వర్ణం సాధించారు. మిక్స్‌డ్ కాంపౌండ్‌లో చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ స్వర్ణం గెలిచారు. పురుషుల కాంపౌండ్ టీమ్‌లో సాహిల్ జాదవ్, గణేశ్ మణి రత్నం తిరుమూరు, కుశాల్ దలాల్ స్వర్ణం సాధించారు. మిక్స్‌డ్ ట్రాప్‌లో నీరూ ధాండా, కైనన్ చెనాయ్ స్వర్ణం అందించారు. మహిళల 60 కిలోల బాక్సింగ్‌లో ప్రియ గంఘాస్, పురుషుల 90 కిలోల బాక్సింగ్‌లో కపిల్ పొఖరియా, గ్రెకో-రోమన్ 87 కిలోల్లో సునీల్ కుమార్ కాంస్యాలు గెలిచారు. ఈ దశలో భారత్ స్వర్ణాల సంఖ్య 10కి చేరింది.
అక్టోబర్ 1న 12వ రోజు స్క్వాష్, ఆర్చరీ, రెజ్లింగ్ విభాగాల్లో పతకాలు వచ్చాయి. గ్రెకో-రోమన్ 97 కిలోల విభాగంలో నితేశ్ కుమార్ రజతం, పురుషుల స్కిఫ్ సెయిలింగ్‌లో ప్రిన్స్ కురిసింకల్ నోబుల్, మను ఫ్రాన్సిస్ రజతం సాధించారు. మహిళల టీమ్ స్క్వాష్‌లో అనాహత్ సింగ్, జోష్నా చిన్నప్ప, తన్వి ఖన్నా, షమీనా రియాజ్ కాంస్యం సాధించారు. పురుషుల టీమ్ స్క్వాష్‌లో అభయ్ సింగ్, వీర్ చోత్రాని, వేలవన్ సెంథిల్‌కుమార్, సూరజ్ కుమార్ చంద్ కాంస్యం గెలిచారు. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీలో గణేశ్ మణి రత్నం తిరుమూరు కాంస్యం సాధించాడు.
అక్టోబర్ 2న 13వ రోజు, భారత్ స్వర్ణ పతకాల పంట పండించింది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో అంకిత భకత్, కుంకుమ్ మోహోద్, కీర్తి శర్మల బృందం దక్షిణ కొరియాను 5-3 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 1998 నుండి వరుసగా ఏడు స్వర్ణ పతకాలు సాధిస్తూ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న దక్షిణ కొరియా పట్టుకు భారత్ తెరదించింది. ఆసియా క్రీడలలో ఈ విభాగంలో భారత్ గెలుచుకున్న మొట్టమొదటి స్వర్ణ పతకం ఇదే కావడం విశేషం.
బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్ (మహిళల 75 కేజీల విభాగం), పర్వీన్ హుడా (మహిళల 65 కేజీల విభాగం), అంకుష్ పంఘాల్ (పురుషుల 80 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో సుజీత్ కల్కల్ స్వర్ణం గెలుచుకున్నారు. మహిళల హాకీ ఫైనల్‌లో చైనాను 1-0తో ఓడించిన భారత్ 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించింది. లాల్రెమ్‌సియామి 10వ నిమిషంలో గోల్ చేయగా, గోల్‌కీపర్ సవితా పునియా కీలకమైన పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకున్నారు. 1982 తర్వాత మహిళల హాకీలో భారత్ సాధించిన తొలి ఆసియా క్రీడల స్వర్ణం ఇదే. ఈ విజయంతో భారత్ లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది.
అదే రోజున, మిక్స్‌డ్ రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో కుంకుమ్ మోహోద్, ధీరజ్ బొమ్మదేవర రజత పతకాలను గెలుచుకోగా, పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో ధీరజ్ బొమ్మదేవర, యష్‌దీప్ భోగే, నీరజ్ చౌహాన్ రజత పతకాలను సాధించారు. మహిళల డింగీ విభాగంలో నేత్ర కుమనన్, మహిళల స్కిఫ్ విభాగంలో హర్షిత తోమర్, శీతల్ వర్మ, అలాగే పురుషుల క్వాడ్రంట్ సెపాక్ తక్రో విభాగంలో భారత జట్టు కాంస్య పతకాలను గెలుచుకున్నాయి.
చివరి రోజు.. ఐదు స్వర్ణాలతో సంచలనం
అక్టోబర్ 3. డే-14. భారత్ పోరాటం ముగింపు రోజే చరిత్రల రోజు అయింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో, 17 ఏళ్ల కుంకుమ్ మోహోద్ ‘షూట్-ఆఫ్’లో దక్షిణ కొరియాకు చెందిన ఓ యే-జిన్‌ను ఓడించింది. ప్రధాన పోటీ 5-5తో సమంగా ముగిసిన తర్వాత, నిర్ణయాత్మక బాణంతో కుంకుమ్ 10 పాయింట్లు సాధించగా, ఆమె ప్రత్యర్థి కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. దీంతో, ఆసియా క్రీడల్లో వ్యక్తిగత రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా కుంకుమ్ చరిత్ర సృష్టించారు. దీంతో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోసం భారత్‌కు ఒక కోటాను కూడా ఆమె ఖరారు చేసుకున్నారు. ఈ క్రీడల్లో కుంకుమ్ మొత్తం మూడు పతకాలను రెండు స్వర్ణాలు , ఒక రజతం సాధించారు.
గోల్ఫ్ లో, ప్రణవి ఉర్స్ 15-అండర్ 265 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. చైనాకు చెందిన యిన్ రువోనింగ్, సింగపూర్‌కు చెందిన షానన్ టాన్ 14-అండర్ 266 స్కోరుతో రజత పతకాన్ని పంచుకున్నారు. ఆసియా క్రీడలలో గోల్ఫ్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా ప్రణవి నిలిచారు. ఆ తర్వాత, ప్రణవి, అదితి అశోక్, దీక్షా దాగర్ బృందం 14-అండర్ 546 స్కోరుతో రజత పతకాన్ని సాధించగా, చైనా జట్టు 22-అండర్ 538 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
క్రికెట్ ఫైనల్‌లో భారత్ 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగా, పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులు, తిలక్ వర్మ 22 బంతుల్లో 51 పరుగులతో (నాటౌట్) రాణించగా, శివం దూబే 15 బంతుల్లో 27 పరుగులు చేశాడు. పాకిస్థాన్ తరఫున హసన్ నవాజ్ 51 బంతుల్లో 96 పరుగులు చేసి గట్టి పోరాటం ప్రదర్శించినప్పటికీ, అది జట్టును విజయపథంలో నడిపించడానికి సరిపోలేదు. భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడంతో, ఇప్పటికే స్వర్ణం గెలిచిన మహిళా జట్టు సరసన నిలుస్తూ.. ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత్ ‘డబుల్ గోల్డ్’ సాధించింది. పురుషుల ఫైనల్ మ్యాచ్ 211/6 , 192/6 స్కోర్లతో ముగిసింది.
ఈ ఫైనల్‌లో పాల్గొన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల 6 నెలల 10 రోజుల వయసులో ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రీడాకారుడిగా నిలిచాడు. గతంలో 2018లో 16 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించిన షూటర్ సౌరభ్ చౌధరి పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. పాకిస్థాన్‌తో ఫైనల్లో వైభవ్ 9 బంతుల్లో 15 పరుగులు చేశాడు.
57 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రావత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన హాన్ చోంగ్-సాంగ్‌ను 11-7తో సెహ్రావత్ ఓడించాడు. తొలి పీరియడ్‌లో 6-1తో ఆధిక్యంలో ఉన్న అమన్, ఆ తర్వాత 6-7తో వెనుకబడినప్పటికీ, ‘ఫోర్-పాయింట్ మూవ్’తో తిరిగి ఆధిక్యాన్ని సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. దీంతో రెజ్లింగ్‌లో భారత్ తన రెండో స్వర్ణ పతకాన్ని సాధించినట్లయింది.
పురుషుల వ్యక్తిగత రికర్వ్‌లో నీరజ్ చౌహాన్ 6-4తో సహచరుడు ధీరజ్ బొమ్మదేవరను ఓడించి కాంస్యం గెలిచాడు. దీంతో భారత్ ఆర్చరీలో మరో పతకాన్ని ఖరారు చేసుకుంది. మహిళల టీమ్, మిక్స్‌డ్ టీమ్, పురుషుల టీమ్, పురుషుల కాంపౌండ్ టీమ్, మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ కాంపౌండ్, వ్యక్తిగత రికర్వ్ ఇలా ఆర్చరీలో భారత్ పతకాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
చివరగా హాకీ స్వర్ణం భారత్ పతకాల ఖాతాకు ముగింపు పలికింది. పురుషుల ఫైనల్లో మలేషియాను భారత్ 5-1తో ఓడించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, జుగ్‌రాజ్ సింగ్, హార్దిక్ సింగ్, శిలానంద్ లక్రా ఒక్కో గోల్ చేశారు. మలేషియా తరఫున షెల్లో సిల్వేరియస్ ఏకైక గోల్ చేశాడు. ఈ విజయంతో పురుషుల హాకీలో వరుసగా రెండో ఆసియా క్రీడల స్వర్ణాన్ని భారత్ సాధించింది. ఆసియా క్రీడల్లో వరుసగా పురుషుల హాకీ టైటిల్స్ గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. ఐదో హాకీ స్వర్ణాన్ని సాధించిన భారత్‌కు లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ కోటా కూడా లభించింది.
అంతేకాదు.. ఒకే ఆసియా క్రీడల్లో పురుషులు, మహిళల హాకీ జట్లు రెండూ స్వర్ణాలు సాధించడం భారత్‌కు ఇదే తొలిసారి. మహిళలు చైనాను 1-0తో, పురుషులు మలేషియాను 5-1తో ఓడించి ఈ డబుల్ గోల్డ్‌ను అందుకున్నారు. క్రికెట్‌లోనూ మహిళలు, పురుషులు స్వర్ణాలు సాధించడంతో ఈ క్రీడల్లో భారత్ రెండు జట్టు క్రీడల్లో డబుల్ గోల్డ్ సాధించింది. కబడ్డీలోనూ పురుషులు, మహిళలు స్వర్ణాలు సాధించారు. దీంతో, ఒకే ఆసియా క్రీడలలో మూడు భారతీయ జట్లు (కబడ్డీ, క్రికెట్ , హాకీ) పురుషుల, మహిళల విభాగాల్లో రెండింటిలోనూ స్వర్ణ పతకాలు సాధించే ఘనత దక్కింది.
భారత్ సాధించిన ప్రధాన చారిత్రక ఘనతలు
- కుంకుమ్ మోహోద్ — ఆసియా క్రీడల్లో వ్యక్తిగత రికర్వ్ స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ. 17 ఏళ్ల వయసులోనే రెండు స్వర్ణాలు, ఒక రజతం.. మొత్తం మూడు పతకాలు సాధించింది.
- ప్రణవి ఉర్స్ — ఆసియా క్రీడల్లో వ్యక్తిగత గోల్ఫ్ స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ. 15-అండర్ 265తో స్వర్ణం, టీమ్ ఈవెంట్‌లో 14-అండర్ 546తో రజతం సాధించింది.
- భారత మహిళల రికర్వ్ టీమ్ — ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో తొలి స్వర్ణం. 1998 నుంచి వరుసగా ఏడు టైటిల్స్ గెలిచిన దక్షిణ కొరియా ఆధిపత్యానికి భారత్ తెరదించింది.
- భారత మహిళల హాకీ — 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల స్వర్ణం. 1982 తర్వాత మళ్లీ స్వర్ణం సాధించింది. చైనాపై ఫైనల్లో 1-0 విజయం.
- భారత పురుషుల హాకీ — వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. మలేషియాపై ఫైనల్లో 5-1 విజయం. లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్ కోటా కూడా దక్కింది.
- క్రికెట్ — మహిళలు, పురుషులు ఇద్దరూ స్వర్ణాలు సాధించి డబుల్ గోల్డ్. పురుషుల ఫైనల్లో పాకిస్థాన్‌పై 19 పరుగుల విజయం. భారత్ 211/6, పాకిస్థాన్ 192/6.
- గుల్వీర్ సింగ్ — 10,000 మీటర్లలో రజతం, 1500 మీటర్లలో రజతం, 5000 మీటర్లలో కాంస్యం.. ఒకే ఆసియా క్రీడల్లో మూడు వ్యక్తిగత దూర పరుగు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా ప్రత్యేక ఘనత.
- విథ్యా రామరాజ్ — మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో 54.75 సెకన్లతో పీటీ ఉషా 55.42 సెకన్ల జాతీయ రికార్డును అధిగమించింది.
- సావన్ బర్వాల్ — పురుషుల మారథాన్‌లో రజతం సాధిస్తూ భారత్‌కు 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల మారథాన్ పతకాన్ని అందించాడు. 2:11:37తో జాతీయ రికార్డు కూడా నమోదు చేశాడు.
- వైభవ్ సూర్యవంశీ — 15 ఏళ్ల 6 నెలల 10 రోజుల వయసులో ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రీడాకారుడిగా నిలిచాడు.
- నీరూ ధాండా — మహిళల వ్యక్తిగత ట్రాప్‌లో స్వర్ణం, మిక్స్‌డ్ ట్రాప్‌లో స్వర్ణం, మహిళల టీమ్ ట్రాప్‌లో రజతం.. మొత్తం మూడు పతకాలు సాధించింది.
85 పతకాలతో ముగింపు..
చివరి రోజు హాకీ స్వర్ణంతో భారత్ 21వ స్వర్ణాన్ని పూర్తి చేసింది. మొత్తంగా 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో 85 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్థాన్ కూడా 21 స్వర్ణాలు సాధించినా.. భారత్ 27 రజతాలతో మెరుగైన స్థానం సాధించింది.
హాంగ్‌జౌలో భారత్ 100కు పైగా పతకాలు సాధించిన తర్వాత ఈసారి 85 పతకాలతో ముగించినప్పటికీ, ఐచి-నాగోయా క్రీడల్లో చివరి రెండు రోజుల్లో వచ్చిన 11 స్వర్ణాలు భారత ప్రస్థానానికి ప్రత్యేక ముగింపునిచ్చాయి. షూటింగ్‌తో ప్రారంభమైన పతకాల వేటను ఆర్చరీ, గోల్ఫ్, క్రికెట్, రెజ్లింగ్, హాకీ స్వర్ణాలతో భారత్ ఘనంగా ముగించింది. ఈ 14 రోజుల ప్రయాణంలో. అనేక ప్రథమ విజయాలు, రికార్డులు, పునరాగమనాలు, డబుల్-గోల్డ్ ఘనతలు, వ్యక్తిగత మైలురాళ్లతో కూడిన… ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన ఈ ఆసియా క్రీడలు భారత క్రీడా చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయాయి.
