ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడితే అరెస్టులా?.

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌ సహా విపక్ష నేతల అరెస్టును తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అహింసాయుతంగా ఉద్యమిస్తున్న నాయకులను బలవంతంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. అరెస్టులు, జైళ్లు, లాఠీఛార్జీలు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్‌ నేతలకు కొత్త కాదని రేవంత్‌ రెడ్డి అన్నారు. నాయకులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టినంత మాత్రాన ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్‌ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం చేసిన తప్పిదాలకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్‌ విశ్రమించదని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని, రాహుల్‌, ప్రియాంక సహా విపక్ష నేతల అరెస్టు ప్రజాస్వామ్య హక్కులపై ఆందోళన కలిగించే పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌ చేపట్టేందుకు ప్రయత్నించిన విపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘ఓట్‌ చోరీ’ ఆరోపణలపై నిరసనగా ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్‌, ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలు మంగళవారం ప్రయత్నించారు. అయితే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు నేతలు ఆకాశవాణి భవన్‌ ప్రాంగణంలో బైఠాయించి నిరసన చేపట్టారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సవరణపై తమ అభ్యంతరాలను పరిష్కరించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఎనిమిది గంటలకు పైగా కొనసాగిన నిరసన అనంతరం పోలీసులు ఆకాశవాణి భవన్‌ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌, పవన్‌ ఖేరా, కే. సురేశ్‌, అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌, ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ తదితరులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. అంతకుముందు రాహుల్‌ గాంధీ పోలీసుల బారికేడ్లపైకి ఎక్కి జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు కిందకు దించి వాహనంలోకి తరలించారు.