తెలంగాణలో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారతదేశ కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూలై 23 నుండి ప్రారంభం కానున్న ఈ పుష్కరాలకు ఇంకా సమయం ఉన్నందున, శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు, అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు.

ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి

మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాలైన ధర్మపురి, కాళేశ్వరంతో సహా బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ముఖ్య ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

రాష్ట్రంలో 560 కిలోమీటర్ల గోదావరి నది తీరం వెంట దాదాపు 74 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాలని అధికారులు వివరించారు. లక్షలాది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు వీలుగా ఈ ఘాట్ల నిర్మాణం చేపట్టాలని, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు..

లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. రోడ్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, వసతి సౌకర్యాలు వంటి అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ఒకే రోజు రెండు లక్షల మంది వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీని కోరేందుకు వీలుగా పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు.

మహా కుంభమేళా, గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన పుష్కరాల నిర్వహణలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పుష్కరాల ఏర్పాట్లకు పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave a Reply