ఉత్తరాంధ్రపై ఆర్నాబ్‌ ప్రభావం.. అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలు, వరదల ముప్పు.. అధికారులకు మంత్రి కొండపల్లి ఆదేశాలు
విజయనగరం, ఆంధ్రప్రభ:
ఆర్నాబ్‌ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు.

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నదుల్లో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసినట్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, విద్యుత్‌, వైద్య శాఖలు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.