పశ్చిమగోదావరి జిల్లాలో రెడ్‌ అలర్ట్‌

ఆర్నబ్‌ తుపానుతో భారీ వర్షాలు.. 2 వేల విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం

5 వేల చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం.. ఇద్దరు మృతి, ఆరు పశువులు మృత్యువాత

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఆర్నబ్‌ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో పశ్చిమగోదావరి జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. తుపాను గాలుల తీవ్రతకు జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. భద్రతా కారణాలతో విద్యుత్‌ ఫీడర్లను షట్‌డౌన్‌ చేయడంతో జిల్లా అంతటా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. త్వరలోనే సరఫరాను పునరుద్ధరిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

జిల్లాలో సుమారు 5 వేల చెట్లు కూలి రహదారులపై పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లను తొలగించేందుకు జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వాకల్చర్‌ రంగాలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదికలు అందాయని కలెక్టర్‌ తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ పంటలకు భారీ నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందగా, ఆరు పశువులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్‌ నాయిమ్‌ అస్మి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనశ్రీ పాల్గొన్నారు.