సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే క్షమించరు
అమరధామం వద్ద సాయుధ పోరాట యోధులకు నివాళులు
పరకాల, ఆంధ్రప్రభ : తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని అమరధామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులను స్మరించుకునే కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో వీరోచిత పోరాటం నిర్వహించిందన్నారు. తెలంగాణలోని 4 వేల గ్రామాలను విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి చెందుతుందని తెలిపారు.
నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు దోపిడీ, దౌర్జన్యాలకు గురయ్యారని, స్వేచ్ఛ, వెట్టి చాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు సాగాయని గుర్తుచేశారు. వేలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. ఈ పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేడు ఉద్యమాన్ని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. తెలంగాణ విమోచన కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను నేటి తరానికి తెలియజేయడం చారిత్రక అవసరమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఆదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, పరకాల మండల కార్యదర్శి దుప్పటి సాంబయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొట్ల చక్రపాణి, సీపీఐ నాయకురాలు ఉమా, ఉభయ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
