Arctic Open |ఆర్కిటిక్‌ ఓపెన్‌లో సింధు సత్తా.. ఇంటనాన్‌తో కీలక పోరుకు రెడీ

వాంటా (ఫిన్లాండ్‌), ఆంధ్రప్రభ: భారత స్టార్‌ షట్లర్‌, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఆర్కిటిక్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌కు చెందిన రికో గుంజీపై వరుస గేమ్‌లలో విజయం సాధించింది. 49 నిమిషాల పాటు సాగిన పోరులో సింధు 21-15, 21-15తో గుంజీని ఓడించింది. దీంతో టాప్‌ సీడ్‌, థాయ్‌లాండ్‌ మాజీ ప్రపంచ చాంపియన్‌ రచ్చనోక్‌ ఇంటనాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

ఐదేళ్ల తర్వాత మళ్లీ ముఖాముఖి

సింధు–ఇంటనాన్‌ మధ్య పోరు బ్యాడ్మింటన్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. మహిళల సింగిల్స్‌లో ఈ ఇద్దరి మధ్య ఇప్పటికే బలమైన పోటీ ఉంది. ఇప్పటివరకు 13 సార్లు తలపడగా.. ఇంటనాన్‌ 9 విజయాలతో ఆధిక్యంలో ఉంది. సింధు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. అంతేకాకుండా వీరిద్దరి చివరి ఐదు పోరుల్లోనూ థాయ్‌ షట్లరే విజయం సాధించింది. 2022 ఇండోనేషియా మాస్టర్స్‌లో వీరిద్దరూ చివరిసారిగా తలపడగా.. ఆ మ్యాచ్‌లోనూ ఇంటనాన్‌ వరుస గేముల్లో గెలిచింది.

అయితే ఈ ఏడాది సింధు మంచి ఫామ్‌లో ఉంది. జూలైలో జరిగిన జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టైటిల్‌ను ఆమె సొంతం చేసుకుంది. ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ అకానే యమగూచిని ఓడించి ఈ ఘనత సాధించింది. దీంతో ఆర్కిటిక్‌ ఓపెన్‌లోనూ సింధు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

మరోవైపు ఇంటనాన్‌ కూడా ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేస్తోంది. మేలో జరిగిన మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీలో చైనాకు చెందిన చెన్‌ యుఫెయిని ఫైనల్లో ఓడించి టైటిల్‌ సాధించింది. ప్రీక్వార్టర్‌ ఫైనల్లో భారత యువ షట్లర్‌ తన్వీ శర్మపై 21-18, 21-7తో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

తొలి గేమ్‌లో తన్వీ.. ఇంటనాన్‌కు గట్టి పోటీ ఇచ్చింది. స్కోరు 17-17తో సమంగా ఉన్న సమయంలోనూ పోరాటాన్ని కొనసాగించింది. అయితే కీలక దశలో అనుభవాన్ని ప్రదర్శించిన ఇంటనాన్‌ వరుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో మాత్రం ఆమె పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 9-2తో ఆధిక్యంలోకి వెళ్లిన అనంతరం మ్యాచ్‌ను సులువుగా ముగించింది.

గుంజీపై కీలక దశలో సింధు దూకుడు

గుంజీతో జరిగిన మ్యాచ్‌లో సింధుకు రెండు గేముల్లోనూ గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌లో స్కోరు 15-15తో సమంగా ఉన్న సమయంలో సింధు ఒక్కసారిగా జోరు పెంచింది. వరుసగా ఆరు పాయింట్లు సాధించి గేమ్‌ను 21-15తో సొంతం చేసుకుంది.రెండో గేమ్‌లోనూ గుంజీ 13-13తో సమం చేసి సింధుపై ఒత్తిడి పెంచింది. అయితే కీలక సమయంలో భారత స్టార్‌ మరోసారి తన అనుభవాన్ని చూపించింది. తర్వాతి 10 పాయింట్లలో ఎనిమిది సాధించి 21-15తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా ముగించింది.