అరసవల్లి అభివృద్ధికి రూ.55.74 కోట్లు
స్వదేశ్ దర్శన్–2.0 కింద నిధుల మంజూరు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్–2.0 పథకం కింద రూ.55.74 కోట్ల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని.. శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను అమలు చేస్తున్నామని తెలిపారు.
మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, అనుసంధానతతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో అరసవల్లికి దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరుల సహకారంతో అరసవల్లి ఆలయం మరింత అభివృద్ధి చెందేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రధాన ఉత్సవమైన రథసప్తమి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని, లక్షలాది మంది భక్తులు అరసవల్లిని సందర్శిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో జిల్లాలో అభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు.
