AR Rahman | రామాయణం సాంగ్స్ వివాదం.. ట్రోలర్స్‌కు రెహమాన్ సాలిడ్ ఆన్సర్!
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఆస్కార్ విజేతగా నిలిచిన ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణం’ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి రాముడు, సీతాదేవి పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘మంగళ భరితమే’ సాంగ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది.
కాగా ఈ పాటలో సీతారాముల కళ్యాణ సమయంలో వచ్చే మ్యూజిక్ ఖవ్వాలీ తరహా సంగీతం, సూఫీ ఛాయలు వినిపించాయంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రామాయణ పవిత్రతకు తగ్గట్టుగా శాస్త్రీయ సంగీతాన్ని వాడకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా ఈ విమర్శలపై ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
“నేను సోషల్ మీడియా రియాక్షన్లను పట్టించుకోనూ.. వాటిని చూడడానికి నా దగ్గర అంత టైమ్ లేదు. నా పని పట్ల నేను నిజాయితీగా ఉండటమే నాకు ముఖ్యం” అని స్పష్టం చేశారు. ఒక పాట చేయడానికి నెలల తరబడి ఎంతో కష్టపడ్డామని చెప్పారు. విమర్శకుల నోళ్లను మూయిస్తూ ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వ్యాఖ్యలను రెహమాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలి’ అంటూ చురకలంటించారు. ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా సంగీతాన్ని కంపోజ్ చేయడం ఎవరివల్ల కూడా సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
కొన్ని పాటల వెనుక ఉన్న ప్రయోగాన్ని ప్రేక్షకులు మొదట్లో అర్థం చేసుకోలేరని, కాలం గడిచేకొద్దీ అవే అందరికీ నచ్చుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన ‘రావణ తండవం’ సాంగ్‌కు కూడా మొదట్లో ఇలాగే వ్యతిరేకత వచ్చిందని, ఆ తర్వాత జనాలకు అదే బాగా నచ్చిందని గుర్తుచేశారు.
‘మంగళ్‌భరితమే’ పాటపై వస్తున్న విమర్శలకు మ్యూజిక్ పరంగా బదులిస్తూ.. ఈ కంపోజిషన్ కోసం హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలోని పలు రాగాలను మేళవించినట్లు తెలిపారు. ముఖ్యంగా బిలావల్ రాగంలోని శుద్ధ స్వరాలతో పాటు మాండ్, పహాడీ రాగాల ఛాయలను ఉపయోగించామని, వివాహాలు, భజనల్లో వినిపించే సంప్రదాయ మూలాలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించినట్లు వివరించారు. ఎన్ని విమర్శలు వ్యక్తమైనప్పటికీ, ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండింగ్‌లో మాత్రం నంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తుండటం విశేషం.
ఇది కేవలం ఒక్క వ్యక్తి ప్రయాణం కాదని, హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్‌తో కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం గర్వకారణమని రెహమాన్ వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఐదు భాషల్లో రెండు వేర్వెర్షన్లలో మ్యూజిక్ అందించడం చాలా పెద్ద సవాల్ అని, ప్రతి స్వరాన్ని ఎంతో బాధ్యతతో తీర్చిదిద్దామని ఆయన తెలిపారు.
