ఫీడ్ ధరల భారంతో కుదేలవుతున్న ఆక్వా రైతులు..
ఏలూరు జిల్లా కలెక్టర్ కు రైతన్నల వినతి
ఏలూరు కార్పొరేషన్, సెప్టెంబర్ 3 (ఆంధ్రప్రభ): రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో సాగవుతున్న రొయ్యల సాగు సంక్షోభంలో పడింది. ఫీడ్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి నిరసనగా గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయని రైతులు మండిపడ్డారు.
రొయ్యలకు మార్కెట్‌లో సరైన ధర లేక అల్లాడుతుంటే, ఫీడ్ ధరలు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చులు పెరిగి సాగు గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన రైతులు, ఫీడ్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు నాయకులు పి. బోస్ రాజు, బి.హెచ్. సుబ్బరాజు, ఎన్. కృష్ణవర్మ, వి. నాగేంద్ర, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
