MLA | అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దూకుడు

MLA | అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దూకుడు

.డబుల్ ఇంజిన్ సర్కారు పనితీరు అద్భుతం
.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
.శ్రీరాంపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
.హాజ‌రైన కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం

MLA | (రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ) : ఏపీలో అభివృద్ధి, సంక్షేమంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు దూసుకుపోతున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు (Mylavaram MLA Vasantha Venkata Krishnaprasad) పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని శ్రీరాంపురంలో రూ.32 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవన నిర్మాణానికి, రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సొసైటీ భవన నిర్మాణానికి కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాంతో కలసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సోమవారం శంకుస్థాపన చేశారు. 26 మంది రైతులకు రూ.2.16 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సొసైటీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. శ్రీరాంపురం గ్రామంలో మంచి విలువలతో కూడిన ప్రజలతో పాటు పట్టుదల కలిగిన నాయకత్వం ఉందన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో పాటు కష్టపడి సాధించే కార్యదక్షత కూడా కలిగిన ఈ నాయకత్వం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

సమస్యల పరిష్కారానికి హామీ…
రెడ్డిగూడెంలో కమ్యూనిటీ హల్ (Community Hall) నిర్మాణానికి కూడా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. కృష్ణాజలాలు మిగిలిన గ్రామాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇస్తామని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లకు ఇచ్చే రుణాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు
శంకుస్థాపన కార్యక్రమం (Groundbreaking ceremony) పూర్తిగా పండుగ వాతావరణంలో సందడిగా జరిగింది. తొలుత రామాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. గ్రామస్తులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మహిళలు కోలాట నృత్యంతో ఆకట్టుకున్నారు. అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

స్థలదాతలకు ప్రత్యేక అభినందనలు
గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పంచాయతీ భవన స్థలదాతలు నాదెళ్ల చెన్నకేశవరావు (Nadella Chennakesava Rao) సర్పంచి అట్లూరి శ్రీనివాసరావులను, పీ.ఏ.సి.ఎస్ స్థలదాతలు వెంకట కృష్ణారావు, చంద్రశేఖర్ లను ప్రత్యేకంగా అభినందించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply