ఎన్‌హెచ్‌ఎంలో 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు

  • అక్టోబర్‌ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
  • డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సి.హెచ్‌. మధుసూదన్‌

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 33 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సి.హెచ్‌.మధుసూదన్‌ తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో పోస్టుల వివరాలను వెల్లడించారు. ఎంఎల్‌హెచ్‌పీ–12, స్టాఫ్‌ నర్స్‌–09, ల్యాబ్‌ టెక్నీషియన్‌–04, సెకండ్‌ ఏఎన్‌ఎం–03, పీడియాట్రిషియన్‌–01, జనరల్‌ ఫిజీషియన్‌–01, ఎస్‌టీఎల్‌ఎస్‌–01, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్‌, స్పెషలిస్ట్‌ ఎడ్యుకేటర్‌–01, డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌–01 పోస్టులు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 3 ఉదయం 10.30 గంటల నుంచి అక్టోబర్‌ 13 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలి. జయశంకర్‌ భూపాలపల్లిలోని ఐడీఓసీ, ఎఫ్‌25 బ్లాక్‌లో ఉన్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. పోస్టుల వారీగా విద్యార్హతలు, దరఖాస్తు ఫారం, మార్గదర్శకాలు, ఇతర నిబంధనలను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.