తిరుపతి : తిరుపతి నగరంలోని ఎస్వీ జూపార్క్ లో పులికూన ఒకటి మృతి చెందింది. రెండు రోజుల కిందట అది చనిపోయిందని జూ నిర్వాహకులు ప్రకటించారు. పులి పిల్ల అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు జూపార్కు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన ఇటీవల చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. పులిపిల్ల మృతిచెందిన రోజే దానికి పోస్టుమార్టం నిర్వహించి, అదే రోజు ఖననం చేశారు. పులి పిల్ల గుండె, కిడ్నీ వ్యాధితో మృతి చెందినట్లు జూపార్కు డీఎఫ్‌వో సెల్వం వెల్లడించారు. జూకి తరలించిన కొన్నిరోజులకే ఒక కూన మృతిచెందగా, తాజాగా ఈ నెల 29వ తేదీన మరొకటి చనిపోయింది.
ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో తల్లి నుండి వేరు అయిన నాలుగు పులి పిల్లలు లభ్యమైన విషయం తెలిసిందే. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి నాలుగు పులి పిల్లలను రక్షించారు. పులి పిల్లల కోసం పులి వస్తుందేమో అని ఫారెస్టు అధికారులు అనేక విధాలుగా ప్రయత్నం చేసినా పెద్దపులి జాడ ఏమాత్రం కనిపించలేదు. అయితే ఈ పులి కూనల సంరక్షణార్థం తిరుపతి ఎస్వీ జూ పార్కుకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు పులి పిల్లల్లో ఒక పులి పిల్ల చనిపోయింది.