Saturday, November 23, 2024

YSRCP Ticket Race – రెండు సార్లు టిక్కెట్ మిస్… ఈసారైనా ఇస్తారా…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో:
అధికార వైసీపీలో టిక్కెట్‌లు ఆశించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది ఈ సంఖ్య రెట్టింవు అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆశావహులు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ జాబితాలో ఆశావహులతోపాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వీర విధేయులు కూడా ఉన్నారు. వారంతా 2014, 2019 ఎన్నికల్లో టిక్కెట్‌లు ఆశించి అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సూచన లతో పోటీనుంచి తప్పుకుని వైసీపీ అభ్యర్థి గెలుపుకోసం తమవంతు కృషి చేశారు. అటువంటి వారంతా వచ్చే ఎన్నికల్లో తమకు ఎలాగైనా అవకాశం కల్పించాలని ఇప్పటినుండే గట్టి ప్రయత్నం చేస్తూ గతంలో తాము చేసిన త్యాగాలను పార్టీ పెద్దలకు మరోసారి గుర్తు చేస్తున్నారు. మరి కొంతమంది సీనియర్‌ నేతలైతే అవకాశం దొరికినపుడల్లా స్వయంగా సీఎం జగన్‌ను కలిసి తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ప్రతీ జిల్లా నుంచి సుమారు ముగ్గురికి తక్కువ లేకుండా వీర విధేయులు ఉన్నారు. వీరంతా 2024 ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా అసెంబ్లిdలో అడుగు పెట్టాలని కలలు కంటున్నారు. మొత్తం మీద 50 మందికి పైగా విధేయులు, 50 మందికి పైగా ఆశా వహులు ఇలా వందమందికి పైగా కొత్తగా టిక్కెట్‌లు ఆశించే వారి సంఖ్య వైసీపీలో కనిపిస్తోంది. ఎన్నికల సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను సొంతం చేసుకోవాలని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ యోచిస్తూ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే 50 నియోజకవర్గాల్లో చేర్పులు, మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఈ సంఖ్య తగ్గే అవకాశాలే ఉన్నాయి కాని పెరిగే అవకాశాలు అయితే మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే సీఎం జగన్‌ పదే పదే ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్‌ను పెంచుకోవాలని సూచిస్తూ వివిధ కార్యక్రమాల పేరుతో నిరంతరం ప్రజా ప్రతినిధులను ప్రజల్లోనే ఉండేలా చూస్తున్నారు. దీంతో ఎన్నికల సమయానికి మరి కొంత మంది ఎమ్మెల్యేలకు అనుకూల వాతావరణం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహులకు, విధేయులకు పూర్తి స్థాయిలో అవకాశాలు లభించకపోవచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ముచ్చటగా మూడో ప్రయత్నం
వైసీపీ ఆవిర్భవించాక 2012లో ఉప ఎన్నికలతో పాటు 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది. రెండోసారి ఏకంగా 151 స్థానాల్లోనూ గెలుపొంది అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మొత్తం175 స్థానాలనూ కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. కాగా గత రెండు ఎన్నికల్లో 175 స్థానాల నుంచి దాదాపుగా 225 మందికి పైగా నేతలు టిక్కెట్లు ఆశించారు. వారంతా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారే. అయితే ఆ ఎన్నికల్లో 175 మందికి మాత్రమే అవకాశం లభించింది. మిగిలిన 50 మందిని అధినేత జగన్‌ బుజ్జగించి మరోసారి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2019లోనూ కొంతమంది విధేయులకు అదే పరిస్థితి పునరావృతం అయింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని సీఎం జగన్‌ భరోసానిచ్చారు. ప్రత్యేకించి ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 60 శాతం మందికి పైగా వరుసగా రెండు సార్లు పోటీ చేసి గెలుపొందిన వారే ఉన్నారు. వారిలో 45 శాతం మందికి పైగా సిట్టింగ్‌ స్థానాల నుంచి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న నేపధ్యంలో కొంతమందికి నియోజకవర్గాలు మార్పులు చేయడంతో పాటు మరి కొంతమంది స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ యోచిస్తున్నారు. అదే జరిగితే గత రెండు ఎన్నికల్లో త్యాగాలు చేసిన విధేయులకు ఛాన్స్‌ దొరికే అవకాశాలు ఉంటాయి.

సీఎం జగన్‌ మొగ్గు ఎటో?
ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ఇటు పార్టీ పదవుల్లోనూ, అటు ప్రభుత్వ పదవుల్లోనూ ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే జిల్లాల వారీగా కొన్ని నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన మార్పులపై కసరత్తు చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో విధేయుల పేర్లను కూడా పరిశీలిస్తూ వారి పేర్ల మీద సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. ఆశావాహులతో పాటు విధేయులకు మరింత ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. సర్వే నివేదికల ఆధారంగా గెలిచే వారికి ఛాన్స్‌ లభించబోతుంది. మరీ..సీఎం జగన్‌ వెనుకబడిన నియోజకవర్గాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..ఎవరికి అవకాశం కల్పిస్తారోనని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement