-అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అభ్యర్థుల చేర్పులు – మార్పులపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా ప్రాంతాలకు చెందిన నేతలతో నేరుగా మాట్లాడుతూ వారిని బుజ్జగిస్తున్నారు. ఇదే సందర్భంలో టికెట్ ఏ కారణం చేత ఇవ్వలేకపోతున్నామో వారికి స్పష్టంగా వివరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో పార్టీకి విధేయులుగా ఉన్న వారిని సైతం మార్చకతప్పని పరిస్థితి ఉంటుందని, స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని అధిష్టానం ప్రకటిస్తున్న అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని సూచిస్తున్నారు. దీంతో కొంతమంది మెట్టుదిగి పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపే ల క్ష్యంగా పనిచేస్తామని అధినేతకు హామీనిస్తున్నారు. సీఎం జగన్ కూడా వారికి ప్రత్యామ్నాయంగా మరో అవకాశం కల్పిస్తామని భరోసానిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ప్రకటించిన నియోజకవర్గాల్లో దాదాపుగా 80 శాతం వరకు అంతా సర్దుబాటు అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఆయా నియోజవర్గాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేర్పులు – మార్పుల్లో భాగంగా సీటు దక్కించుకున్న నేతలు అంతా కలిసికట్టుగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తోంది. నిన్న, మొన్నటి వరకు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించిన సిట్టింగ్లు ఒక్కొక్కరుగా తాడేపల్లికి చేరుకుంటూ సీఎం జగన్తో భేటీ అవుతున్నారు. అధినేత కూడా వారిని బుజ్జగించి అధైర్యపడొద్దు.. మళ్లిd మనమే వస్తున్నాం. రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత కలిగిన పదవులతో పాటు ఎమ్మెల్సీ అవకాశాలు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ముఖ్యనాయకులకు సీఎం జగన్ నుంచి బలమైన భరోసా లభిస్తుండంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం సద్దుమణుగుతున్నది.
పది రోజుల క్రితమే వైసీపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు శనివారం పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నిర్ణయం వైసీపీతో పాటు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. క్రికెట్లో కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అంబటి రాయుడు రాజకీయ విషయాల్లో కూడా అంతే వేగంగా నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది. అయితే అంబటి రాయుడు రాజీనామా వెనుక అసలు కారణాలు ఏంటి..? అన్న అంశంపై కూడా చర్చ నడుస్తోంది. ఆయనకు గుంటూరు లోక్సభ టికెట్ ఇస్తామని గతంలో అధిష్టానం హామీనిచ్చింది. ఆ స్థానంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయులకి కేటాయించే యోచనలో అధిష్టానం ఉంది. ఇదే విషయంపై శనివారం లావు తాను గుంటూరుకు వెళ్లనని నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసే క్రమంలో గుంటూరు పార్లమెంట్ సీటు వ్యవహారం వెలుగుచూసింది. ఈ కారణంతోనే అంబటి తనకు గుంటూరు టికెట్ లభించే అవకాశాలు లేవన్న అసంతృప్తితోనే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే పార్లమెంట్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్ ఈ రెండు వ్యవహారాలపై శనివారం ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.
అంబటి రాయుడుతో పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నేతలు మాట్లాడుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటనలో కొంత జాప్యం జరిగే అవకాశాలు క నిపిస్తున్నాయి. వాస్తవానికి ఆది, సోమవారాల్లో మూడో జాబితాలో 12 మంది ఎంపీ అభ్యర్థుల మార్పులు ప్రకటించే యోచనలో అధిష్టానం ఉంది. అయితే ఎంపీ స్థానాలు చేర్పులు – మార్పుల్లో భాగంగా మరికొంతమందిని పిలిపించి చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా మూడో జాబితాలో ఎంపీ అభ్యర్థులను మినహాయిస్తున్నట్లు సమాచారం.
20 అసెంబ్లి స్థానాల జాబితా విడుదల..
ఇప్పటికే 38 అసెంబ్లిd స్థానాలకు రెండు లోక్సభ స్థానాలతో మొదటి, రెండు జాబితాలను ప్రకటించిన వైసీపీ అధిష్టానం మూడో జాబితాలో 12 లోక్సభ, 38 అసెంబ్లిd స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావించింది. ఆ దిశగానే కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. అయితే ఎంపీ అభ్యర్థులతో పాటు అసెంబ్లిd స్థానాలకు సంబంధించి మరికొన్ని జిల్లాల్లో ముఖ్య నేతలతో భేటీలు కొనసాగుతున్న నేపథ్యంలో 20 స్థానాలతో మూడో జాబితాను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని 20 స్థానాల్లో చేర్పులు – మార్పుల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం 20 మందితో మూడో జాబితాను ప్రకటించే దిశగా వైసీపీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.