Saturday, November 23, 2024

ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీకి కక్కుర్తిపడ్డారు.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీల ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీకి కక్కుర్తిపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు ధ్వజమెత్తారు. గురువారం ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు, ఆర్&ఆర్ ప్యాకేజీ, కడప స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్‌పోర్టు అనుమతులు, రేషన్, రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన రెవెన్యూ లోటు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించారని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై తాము చర్చించామని వారు చెప్పారు. దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో 40% రాష్రం నుంచే జరుగుతోందని, ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచే చర్యలు చేపడుతోందని చెప్పుకొచ్చారు. కోవిడ్ కాలంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానిదని వారు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ… రాష్ట్రాభివృద్ధిపై ప్రధాని, కేంద్ర మంత్రులతో సీఎం చర్చించి వారి నుంచి సానుకూల హామీలు రాబట్టారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం దురదృష్టమని వాపోయారు. సలహాలు ఇవ్వకుండా, తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న మోపిదేవి, చంద్రబాబు దిగిపోయే సమయానికి రాష్ట్ర ఖజానాలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు.

అవసరాల మేరకు అప్పులు తీసుకునే అవకాశం మన వ్యవస్థలో ఉందని తెలిపారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం, నేటి జగన్ ప్రభుత్వంతో పోలిస్తే చిక్కుల్లో పడేది టీడీపీయేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన అప్పులు, బిల్లులు తమ ప్రభుత్వం క్లియర్ చేస్తోందని మోపిదేవి తేల్చి చెప్పారు. అనంతరం ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ఖజానా ఖాళీ చేసి వెళ్ళారని ఎద్దేవా చేశారు. జగన్ కేసులకు భయపడే వ్యక్తి కాదని, సోనియా గాంధీనే ఎదిరించి నిలబడిన శక్తి అని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఫలితాలు త్వరలోనే తెలుస్తాయని, పోలవరం సాధించిన విజయానికి కేంద్రం ఆమోదం తెలుపుతుందని వివరించారు. టీడీపీ ఎంపీలు తమ స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ ఎంపీ ప్రధానమంత్రిని కలిసి తన బాబాయి అచ్చన్నాయుడిని ఈఎస్‌ఐ స్కాం నుంచి బయట పడేయమని అడిగారా అంటూ భరత్ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలకు టిడిపి ఎంపీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే అందుకు తాజా నిదర్శనమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement