Saturday, November 23, 2024

చంద్రబాబు డైరెక్షన్ లో RRR: మిథున్ రెడ్డి

ఏపీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వ్యవహారంపై అధికార, విపక్షల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రఘురామ అరెస్ట్ పై వైసీపీ నేతలు మాటల దాడికి పదును పెట్టారు. రఘురామ కృష్ణ రాజు వెనక చంద్రబాబు ఉన్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరక్షన్ లోనే రఘురామ పని చేశారని తెలిపారు. పోలీసులు కొట్టారు అంటూ డ్రామాలు ఆడారని, బెయిల్ రద్దు అయినా తరువాత కొట్టారని నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. రఘురామకు పార్టీలో సముచిత స్థానం కల్పించామని గుర్తు చేశారు. రఘురామపై రెండు సీబీఐ కేసులు ఉన్నాయని, అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రఘురామ కృష్ణరాజు కుటుంబాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టేలా రఘురామ కృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు కొట్టలేదని వైద్యలే కోర్టుకు నివేదిక ఇచ్చారని చెప్పారు. ప్రాణహానిఉందంటూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. రమేష్ హాస్పిటల్ లొనే చికిత్స ఎందుకు అడుగుతున్నారని మిథున్ రెడ్డి ప్రశ్నించారు.

రఘురామ ఎంపీ కాకముందే 5 సార్లు పార్టీలు మార్చారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. రఘురామ మాట్లాడే బాష అసభ్యంగా ఉందన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటూ మండిపడ్డారు. మంత్రులపై, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇలాంటి మనిషిని చంద్రబాబు భుజాన ఎత్తుకుని మోస్తున్నారని బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement