ఆంధ్రప్రదేశ్ లోని వలంటీర్ వ్యవస్థపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి నమ్మకాన్ని కొంతమంది వలంటీర్లు వమ్ముచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంలోనే 267 మంది వలంటీర్లను విధుల నుంచి తొలగించామన్నారు. కరోనా సమయంలో ప్రజా ప్రతినిధులు బయటకు రాకపోవడాన్ని అలుసుగా చేసుకొని అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందాలనే సంకల్పంతో రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ విధానం తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. దీంతో ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వాలంటీర్ వ్యవస్థ వారధిగా మరింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిందే వలంటీర్ల వ్యవస్థ. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.61 లక్షల మంది వలంటీర్లు ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తీసుకెళ్లారు. అసలూ వలంటీర్లు అవసరమా?’ అని విమర్శించిన ప్రతిపక్షాల నోళ్లు మూతపడేలా వలంటీర్ల వ్యవస్థ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే, కొందరు వలంటీర్లు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.