నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ నేతలు లేఖ రాశారు. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి.. లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని తెలిపారు. అయినా ఇప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని అన్నారు. అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. అర్హత లేని వ్యక్తి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం అనైతికమని, ఈ విషయమై లోకసభ స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించడం లేదు: ఆనందయ్య.