ఏపీలో రెండేళ్ల పాలనలోనే మునుపెన్నడూ చూడని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం సాధించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆయనతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నేతలు ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని తెలిపారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రతిక్షణం విలువైనదేనని భావిస్తూ సీఎం జగన్ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారని సజ్జల చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ తన కుటుంబంగానే భావించి పనిచేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నో హామీలను జగన్ నెరవేర్చారని ఆయన చెప్పారు.
20 ఏళ్లల్లో సాధించలేని అభివృద్ధిని రెండేళ్లలోనే సీఎం జగన్ చేసి చూపారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. మహా నేత వైఎస్ఆర్ అభివృద్ధి బాటలో సీఎం జగన్ నడిచారన్నారు. సీఎం జగన్ ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థను ఇప్పుడు దేశమంతా చూస్తోందని చెప్పారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమాన్ని అందించామని తెలిపారు. ఇలాంటి పథకాలను నిరంతర ప్రక్రియగా చేపట్టి అవినీతికి తావు లేకుండా జగన్ పారదర్శక పాలన అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన, కరోనాతో ఆర్థికంగా కష్టాలు వచ్చినా వాటిని అధిగమించారని తెలిపారు. రాష్ట్రంలో జగన్ పాలన, సంక్షేమపరంగా అన్ని వర్గాలను సమానంగా చూశారన్నాఉ. సీఎం జగన్ వంటి నాయకులు యుగానికి ఒక్కరే వస్తారేమో అనేలా పాలన కొనసాగుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాతలు కలలు గన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ సాకారం చేశారని తెలిపారు. నిజాయతీ, నిబద్ధతతో కూడిన వ్యవస్థను సీఎం జగన్ తన పాలనలో తెచ్చారని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల సీఎం జగన్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతు భరోసాతో రైతులను ప్రభుత్వం ఆదుకుందని సజ్జల చెప్పారు.