ఏపీలో రాజీనామాల వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాట్ వార్ నడుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధికార, విపక్ష పార్టీల మధ్య రాజీనామాపై సవాళ్లు.. ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపడం.. ప్రత్యేక హోదా సాధించడం లక్ష్యంగా టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని.. మరి వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు అందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. రాజీనామాలకు మేము రెడీ రెడీ అనడమే తప్ప.. టీడీపీ రాజీనామా చేసేది లేదని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయవచ్చు కదా? అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళను అడిగామా? అని నిలదీశారు. ఇక, టీడీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారులు, కన్సలటెంట్ల ఎంత మంది ఉండేవారో లెక్కలు తీస్తున్నామని తెలిపారు. గతంలో పరకాల, కుటుంబ రావు లాంటి వారు రాజకీయాలు మాట్లాడినప్పుడు తప్పుగా ఎందుకు కనిపించలేదని ఆయన మండిపడ్డారు.
అమరావతి భూముల వ్యవహారం పెద్ద స్కామ్ అని సజ్జల ఆరోపించారు. అమరావతిలో ఎలాంటి భూ కుంభకోణం జరిగిందో ప్రజలకి తెలుసన్న ఆయన.. అమరావతి అంటేనే పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణం అని పేర్కొన్నారు. సాంకేతిక అంశాల వల్ల కోర్టు రిజెక్టు చేసి ఉండొచ్చుని, అమరావతిలో ఇంకా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించటం సాంకేతికంగా ఇబ్బంది అయితే.. మరో కోణంలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తమ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం కోరుతున్న డిమాండ్ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని సజ్జల చెప్పారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేసులో సీఐడీ ప్రస్తావించిన విషయం నిజం అని ప్రజలకి తెలుసునని సజ్జల పేర్కొన్నారు. స్క్రీన్‌పై రఘురామ ఉంటే, ఆఫ్ స్క్రీన్ పై చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ఆయన ఆరోపించారు. కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టడానికి కుట్ర చేశారని మండిపడ్డారు. ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కూడా ఆధారాలు ఉన్నాయని సజ్జల చెప్పారు.
ఇది కూడా చదవండిః మాన్సాస్ ట్రస్ట్ ఈవో సహకరించడం లేదుః హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్