Saturday, November 23, 2024

నువ్వు నోర్ముయ్.. ఆక్సిజన్ అడిగినందుకు వైసీపీ నేత బెదిరింపులు

కరోనాతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బంధువు కోసం ఆక్సిజన్‌ అడిగిన ఓ  మహిళపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆకుల సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారు. ‘ఛీ… నోర్ముయ్‌’ అంటూ బెదిరించడంతో బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. రావులపాలేనికి చెందిన మహ్మద్‌ అలంగీర్‌ కు కరోనా పాజిటివ్‌ రావడంతో కుటుంబసభ్యులు రాజమహేంద్రవరంలోని ఆదిత్య ఆస్పత్రికి మంగళవారం తరలించారు. ఆయన వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్నాడు. బుధవారం తమ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ లేదని పేషెంట్‌ ను తీసుకుని వెళ్లిపోవాలని ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులకు, ఆస్పత్రి వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నగర కోఆర్డినేటర్‌ ఆకుల సత్యనారాయణ అక్కడకు చేరుకుని బాధితుడి బంధువులతో మాట్లాడారు.

ఆస్పత్రిలో డబ్బులు కట్టామని వెంటిలేటర్‌ పై ఉన్న తన అన్నను ఆకిజన్‌ లేదని తీసుకువెళ్లమంటున్నారని తన గోడును కాస్త గట్టిగా చెప్పడంతో ఆకుల సీరియస్ అయ్యారు. ‘‘నువ్వు నోర్ముయ్‌… డాక్టర్లంటే ఏమనుకుంటున్నారు,  నీ డబ్బులు నీకు పడేస్తాం రూపాయికి పది రూపాయిలు పడేస్తా’’ అంటూ మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఆస్పత్రి యాజమాన్యానికి మద్దతుగా నిలవడంతో అంతా అవాక్కయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఆక్సిజన్‌ ఇవ్వమంటే ప్రభుత్వాన్ని అడగండని చెప్పారని బాధిత మహిళ వాపోయారు. ఆకుల తీరును నిరసిస్తూ ఆస్పత్రి వద్ద ఆయన కారును బాధితుడి బంధువులు అడ్డగించారు.

https://youtu.be/wNopQlsLP1o
Advertisement

తాజా వార్తలు

Advertisement