Monday, November 18, 2024

YSRCP – నవరత్నాల‌కు జగన్ మెరుగులు – మేనిఫెస్టోపైనే లీడ‌ర్ల‌ ఆశలు

విశాఖలో వైసీపీ అధినేత కసరత్తులు
మహిళలకు అత్యంత ప్రాధాన్యం
రైతు రుణమాఫీ.. రైతు భరోసాకు ఇంపార్టెన్స్‌
ఆస‌క్తిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు
పులివెందులలో జ‌గ‌న్ త‌ర‌పున‌ తొలి సెట్ నామిషన్ దాఖ‌లు
25న నేరుగా నామినేషన్ వేయ‌నున్న జ‌గ‌న్‌
అదే రోజు బహిరంగ సభకు స‌న్న‌ద్ధం

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చారు. మనం ప్రజలకు ఏమి ఇచ్చాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. అనే అంశాలపై మేథోమధనం చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో పార్టీ మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. పులివెందుల నుంచి బయలుదేరిన బస్సు యాత్రలో.. ఎక్కడ చూసినా జనం.. జనం. తన నవరత్నాలపైనే మమకారం కనిపించింది. అన్నికంటే అవ్వా తాతల అనురాగం. అక్కాచెల్లెమ్మల ఆప్యాయతను సీఎం వీక్షించారు. మరింత మెరుగైన మేనిఫెస్టో కూడా అవసరమేనని గుర్తించారు. ఈ నేపథ్యంలో సోమవారం మేనిఫెస్టోలో చేర్చే అంశాలపై పార్టీ నేతలతో భేటీ అయ్యారు.

నవరత్నాల్లో మార్పులు..

ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమ్మఒడి పరిధి పెంపు, పెన్షన్లు రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచే చాన్స్ కనిపిస్తోంది. రైతు రుణమాఫీ కోసం జగన్ పైన పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసామని జగన్ ప్రతీ సభలో చెబుతున్నారు. చెసేదే చెబుతామని..చెబితే చేస్తామని జగన్ స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో చెప్పిన డ్వాక్రా సంఘాల రుణ మాఫీ అమలు చేశారు. దీంతో.. ఈ సారి రైతులు, మహిళల కోసం ఏం ప్రకటిస్తారనేది కీలకంగా మారుతోంది. బస్సు యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో జ‌గ‌న్ సమావేశం అయ్యారు. వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశాల్లో ఒక బాక్స్ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

- Advertisement -

రుణమాఫీ పైనే అందరి దృష్టి

రైతుల రుణమాఫీని జగన్ తన మేనిఫెస్టోలో ప్రకటిస్తారా? లేక, రైతు భరోసాను మరింత పెంచుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే పార్టీ కేడర్ కూడా రైతులకు రుణమాఫీపైనే ఆసక్తి చూపుతోంది. రైతు రుణమాఫీకి జగన్ అనుకూల నిర్ణయం తీసుకుంటారని, ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంటుందని కేడర్ భావిస్తోంది. మహిళల కోసం కొత్త నిర్ణయాలు ఉంటాయని నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను టీడీపీ ప్రకటించింది. మరిన్ని హామీలతో మేనిఫెస్టో ప్రకటనకు మూడు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తే మరింత మెరుగైన హామీలతో ముందుకు వెళ్లాలనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది. ఈ స్థితిలో జగన్ నిర్ణయంపైనే అటు వైసీపీ కేడర్.. ఇటు ప్రతిపక్ష కూటమి ఎదురు చూడటం విశేషం.

జగన్ తొలి నామినేషన్ దాఖలు

పులివెందులలో వైఎస్ జగన్ తరుపున మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైసీపీ నాయకులు జనార్దన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రసుతం తాము జగన్ తరపున తొలి సెట్ నామినేషన్ సమర్పించామని, ఈ నెల 25న జగన్ నామినేషన్ వేస్తారని చెప్పారు. కాగా, పులివెందుల‌లో అదే రోజు బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని, అదేరోజు జ‌గ‌న్ మేనిఫెస్టో వెల్ల‌డించనున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement