ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : మనకు జన బలం ఉంది. జనం కోసం పోరాడుదాం, కేసులకు భయపడొద్దు, ప్రలోభాలకు లొంగొద్దు, దాడుల్లో గాయపడిన కార్యకర్తలకు దైర్యం చెబుదాం. రాష్టంలో పర్యటిస్తా, చంద్రబాబు తప్పులు లెక్కపెడదాం. శిశుపాలుడి లెక్క తేలుతుంది. టీడీపీ జనసేన హానీమూన్ సాగనిద్దాం. అసెంబ్లీలో నోరునొక్కితే, శాసన మండలిలో స్వరం పెంచుదాం, అని ఎమ్మెల్సీలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దిశ నిర్ధేశించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరెన్ని కుట్రలు చేసినా.. తమ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. “40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారు అనేది మరిచిపోవద్దు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది. ఎన్నికలు ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలు దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోంది. మరి కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దాం” అన్నారు.
ఆందోళనొద్దు..
మళ్లీ వైఎస్సార్సీపీ ఉవ్వెత్తున ఎగిసే రోజులు దగ్గర లోనే ఉన్నాయని. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తానని జగన్ వివరించారు. మనపై కేసులు పెట్టినా భయపడొద్దని , 40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారని, ఆ విషయం మరిచిపోవద్దన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యల పై పోరాడాలని, అసెంబ్లీ లో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. శాసన మండలి లో గట్టిగా పోరాటం చేద్దాం అని జగన్ వివరించారు.
ఇక కార్యకర్తను ఆదుకుందాం
“ఇప్పటికే ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవ్వలేదు. రైతుభరోసా, విద్యాదీవెన తదితర పధకాలు ఇంకా ఇవ్వలేదు. కొంత సమయం ఇచ్చి చూద్దాం. ఆ తర్వాత ప్రజల తరుపున పెద్ద ఎత్తున్న పోరాటం చేద్దాం” అని జగన్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ త్వరలో మండలి సమావేశాలు ఉండే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలపైనా చర్చించిన అనంతరం మండలిలో వ్యవహరించాల్సిన వ్యూహాంపైనా చర్చించి ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.త్వరలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని ఎమ్మెల్సీల బేటీలో ఆయన ఆ విషయాన్ని దృవీకరించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను ఆయన పరామర్శిస్తారని తెలుస్తోంది.