కూటమి కుట్రలపై యుద్ధం
అబద్ధాలు, మోసాలపైనే నా పోరాటం
బాబు, దత్తపుత్రుడిని ఓడించడమే ధ్యేయం
దగ్గరలోనే మన విజయం
టీడీపీ దిగజారుడు తనంతోనే గీతాంజలి ఆత్మహత్య
ఏపీకి డెస్టినీ విశాఖే.. ఇక్కడ సీఎం కూర్చుంటే ఐటీ రంగం పరుగులు
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో మనమే పోటీ
26న తాడేపల్లిలో మేనిఫెస్టో విడుదల
సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ ముఖాముఖీ
ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్నం ప్రతినిధి – “మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, దత్తపుత్రుల కుట్రలతో పోరాటం చేస్తున్నాం. అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. నేను ఒక్కడిని ఒకవైపు.. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతరులు మరోవైపు. ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్న. విజయానికి దగ్గరగా ఉన్నామనే.. మనపై దాడి తీవ్రతరం చేశారు.” అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. విశాఖపట్నంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని, ఇది టీడీపీ దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. సోషల్ మీడియా మనతోనే ఉందని, సెల్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు మనతోనే ఉన్నారని, దాడులకు భయపడేది లేదన్నారు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ ఏదో రాశాడని, 175కి 175 అసెంబ్లీ.. 25కి 25 లోక్ సభ సీట్లు గెలవబోతున్నామని సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ అన్నారు. విశాఖపట్నం సిటీ ఏపీకి డెస్టినీ అవుతుందని, ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుందని వివరించారు.
విశాఖ ఉక్కు పునర్ వైభవమే లక్ష్యం
‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం .. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది రాజీలేని ధోరణి.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి.. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి.. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడిందని’’ సీఎం జగన్ దుయ్యబట్టారు. అనంతరం విశాఖపట్నం జిల్లా ఎండాడలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు కలిశారు. ఉక్కు కర్మాగార సమస్యను నివేదించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో సీఎం మట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు . శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత హక్కు కేవలం వైఎస్సార్సీపీకే ఉందని.. పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని విశాఖ ఉక్కు కార్మికులను సీఎం వైఎస్ జగన్ కోరారు.
వైసీపీలోకి వలస వరద
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు చేరారు. ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద గాజువాక నియోజకవర్గం బీజేపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశవు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్.. టీడీపీ నుంచి యువజన విభాగం నేత ఏఎన్ఆర్ చేరారు. పార్టీలో చేరిన నేతలకు కండువా కప్పి సీఎం జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.