కురుక్షేత్ర సమరంకు సిద్ధంగా ఉండండి
. మంచి చేశానని నమ్ముతేనే సైనికుడుగా నిలబడండి
. ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
. చేదోడు పథకం కు బటన్ నొక్కి నిధుల విడుదల
. చంద్రబాబుపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి.
కర్నూలు బ్యూరో – రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుందనీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు పథకం కు బట్టనొక్కి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజులు తమ ప్రభుత్వానికి కీలక మన్నారు. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలు నెరవేర్చమన్నారు. రాబోయే ఆరు నెలల కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుందన్నారు. ఈ యుద్ధంలో రాక్షసులు, కౌరవులందరూ ఒకటై సమరానికి సన్నద్ధమవుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారు. ఈ కౌరవులను ఓడించాలంటే మీ అందరి అండదండలు కావాలన్నారు. వైసిపి ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని భావిస్తేనే ప్రతి ఒక్కరూ సైనికులుగా నిలబడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
చంద్రబాబు పాలన కుంభకోణాల మయం
గత చంద్రబాబు ప్రభుత్వ పాలన మొత్తం అవినీతి కుంభకోణాల మయమని ముఖ్యమంత్రి విరుచుక పడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఫైబర్ గ్రిడ్, అమరావతి భూ సేకరణ, విద్యుత్ కొనుగోలు అన్నింటిలో కూడా అడ్డగోలుగా దోచేశారని ఆరోపించారు. దోచిన సొమ్మును దాచుకోవడం పంచుకోవడంతోనే వీరి పాలన ముగిసిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. కనీసం ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. వాళ్లు కూడా చంద్రబాబు మావాడు అని చెప్పుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. వాళ్లకు రావాల్సిన సున్నా వడ్డి వెసులుబాటును కూడా లేకుండా చేశారన్నారు. బ్యాంకుల్లో బంగారం విడిపించుకోలేని పరిస్థితికి చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. పొదుపు సంఘాలను డీఫాల్టర్లను చేశారని విమర్శించారు. నేడు వారిని లక్షాధికారులు చేస్తున్నామని చెప్పారు జగన్. బటన్ నొక్కి 2 .33 లక్షల కోట్లకుపైగా నగుదను వారి ఖాతాల్లో వేస్తున్నామని వివరించారు. 31 లక్షల ఇళ్ల పట్టాలను మహిళలకు ఇచ్చామన్నారు.
చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. ఇప్పుడు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు పడుతోందని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ చెప్పి ఓట్లు వేయించుకొని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. తమ హయంలో భారీగా ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ బీసీలకు కల్పించామని తెలిపారు.
జగనన్న చేదోడు కింద నిధుల జమ
ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు పథకం కింద 3,25,020 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.325.02 కోట్లు జమ చేశారు ముఖ్యమంత్రి. జగన్.కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల చొప్పున చేదోడు సాయం అందించారు. ఈ విడతలో 1,04,551 మంది రజకులకు రూ.104.55 కోట్లు, 1,80,656 మంది టైలర్లకు రూ.180.66 కోట్లు, 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.39.81 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయన్నారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా గురించి చెబుతూ.. గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్ మారలేదన్నారు. రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని పేర్కొన్నారు. అయినా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని, అదెలా సాధ్యమైందో ఆలోచించాలని ప్రజలను కోరారు.
కేవలం ముఖ్యమంత్రి మారడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. గతంలో పొదుపు సంఘాల మహిళల సమస్యలు తొలగిపోవాలంటే చంద్రబాబు పాలన రావాలంటూ టీవీల్లో అడ్వర్టైజ్ మెంట్ వచ్చేదని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా పొదుపు సంఘాల మహిళల కష్టాలు మాత్రం పోలేదని వివరించారు. ఉన్న కష్టాలు తీరకపోగా అప్పటి వరకు వచ్చిన సున్నా వడ్డీ పథకం కూడా చంద్రబాబు ఎత్తేశారని విమర్శించారు. రైతన్నలకూ ఇదే పరిస్థితి ఎదురైందని, పంట రుణాల మాఫీ విషయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, సున్నా వడ్డీ పథకానికి రైతులు దూరమయ్యారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో గజదొంగల ముఠా ఉండేదని, ప్రజల సొమ్మును దోచుకునే కార్యక్రమం జరిగేదని జగన్ విమర్శించారు. కానీ తమ ప్రభుత్వంలో అలా కాదని
వెనుకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక మాదిరిగా దృఢంగా మారుస్తామూ అని ఏదైతే మాట ఇచ్చామో పాదయాత్ర సందర్భంగా.. ఈ రోజు నేను మీ బిడ్డగా మీ అన్నగా..మీ తమ్ముడిగా.. సగర్వంగా తలెత్తుకుని చెబుతున్నట్లు వెల్లడించారు. ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతీ ఒక్క కార్యక్రమం ద్వారా నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాను. వారి జీవిత ప్రయాణంలో తోడుగా ఉండగలిగామని సగర్వంగా, మీ బిడ్డగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. జగనన్న చేదోడు నిధుల జమ వరుసగా నాలుగో ఏడాది అందజేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నామన్నారు.