ఏడో రోజుకి చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర
పార్టీ పథకాలను ప్రచారం చేయాలని హితవు
కుతుహలమ్మ కుమారుడు వైసిపిలో చేరిక
పెరాలసీస్ పేషెంట్ కు రూ.15 లక్షలు సాయం
పూతలపట్టులో నేడు జగన్ బహిరంగ సభ
అన్నమయ్య జిల్లా: ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించే దిశగా నేతలు, కార్యకర్తలు పని చేయాలని సిఎం జగన్ ఆ పార్టీల నేతలకు పిలుపు ఇచ్చారు.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అమ్మగారిపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద బుధవారం ఉదయం అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు నేడు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను జగన్ పేరు పేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసేందుకు విశేషంగా పనిచేయాలని, ఐదేళ్లుగా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం చేసిన మంచిని, ప్రజలకు అందించిన సంక్షేమాన్ని, వివిధ రంగాల్లో తీసుకువచ్చిన గొప్ప సంస్కరణలను ప్రతి గడపకూ వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కుతుహలమ్మ కుమారుడు వైసిపిలో చేరిక
గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత హరికృష్ణ వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ఉన్నారు. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ 2019లో టీడీపీ తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
వైద్యం కోసం రూ.15 లక్షలు సాయం..
సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్‌కు గురయ్యాడు. ఇప్పటికే స్తోమతకు మించి, అప్పుల చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం. అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీఎం వైయస్ జగన్‌ను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని నమ్ముతున్నామని ముఖేష్ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు మేమంతా సిద్ధం యాత్రలో ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసారు. జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు. ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని జగన్ హామీ ఇచ్చారు.
పూతలపట్టులో బహిరంగ సభ ..
కాగా నేటి ఉదయం జగన్ నుదుం, కల్లూరు మీదుగా దామలచెరువు, తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకున్నారు.. అక్కడే ఆయన లంచ్ చేసి కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు.. అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు కు చేరుకున్నారు.. అక్కడ బైపాస్ దగ్గర జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పి కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బస చేయనున్నారు.