Friday, November 22, 2024

YSRCP – నేటి నుంచి సామాజిక సాధికార బస్సు యాత్ర – ఏక కాలంలో మూడు ప్రాంతాల నుండి ప్రారంభం

అమరావతి – వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న సామాజిక సాధికార బస్సు యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది.రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాల్లో ఈ యాత్రలు ఏక కాలంలో చేపట్టనున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, గుంటూరు జిల్లా తెనాలి, అనంతపురం జిల్లా శింగనమల నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా సామాజిక వర్గాల కార్పొరేషన్ల కు సంబంధించిన ఛైర్మన్లు, డైరెక్టర్లు, నేతలు పాల్గొంటారు. ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి బస్సు యాత్ర షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఎంపిక చేసిన ప్రాంతంలో సుమారు 200 మంది పార్టీ నేతలు ఒకచోట సమావేశమై సామూహిక భోజనాలు చేస్తారు.

అనంతరం ముఖ్యనేతలు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి నిర్దేశించుకున్న రూట్ మ్యాప్‌లో బస్సు ప్రయాణం ప్రారంభం అవుతుంది. నిర్దేశించుకున్న పాయింట్లు, ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల దగ్గర స్థానిక ప్రజలతో నాయకులు మమేకం అవుతారు. తమ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అందించిన సంక్షేమ ప్రయోజనాలు, రాజకీయ సాధికారత, ఆయా వర్గాల్లో వచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ పురోగతిని వివరిస్తారు. సాయంత్రం బహిరంగ సభను నిర్వహిస్తారు. అంటే ప్రతిరోజూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో… మూడు బహిరంగ సభలను నిర్వహిస్తారు. సామాజిక బస్సు యాత్ర మూడు దశల్లో జరుగనుంది. గురువారం నుంచి ప్రారంభం అయ్యే ఫస్ట్ ఫేజ్ నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఇందులో భాగంగా ఈనెల 27న గజపతి నగరం, నరసాపురం, తిరుపతి, 28న భీమిలి, చీరాల, పొద్దుటూరు, 30న పాడేరు, దెందులూరు, ఉదయగిరిలో యాత్ర కొనసాగుతుంది. ఈనెల 31న క్యాబినెట్ సమావేశం ఉండటంతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి నవంబర్ 1న పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి, 2న మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు, 3న నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి, 4న శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం, 6న గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం, 7న రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ, 8న సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్‌లో కొనసాగుతుంది. నవంబర్ 9న అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లెలో యాత్ర ముగుస్తుంది. సామాజిక సాధికార యాత్ర డిసెంబర్ 31 వరకు అంటే.. మొత్తంగా 60 రోజుల పాటు బస్సు యాత్ర జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement