శ్రీ సత్యసాయి బ్యూరో (ప్రభ న్యూస్): ఏపీలో మళ్లీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా అధికార వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందుకు పలు అస్త్రాలతో సిద్ధమవుతోంది. బుధవారం జరిగే (రేపు) మంత్రివర్గ భేటీలో చర్చించి.. పలు అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేగాక మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను ఫిబ్రవరి 10వ తేదీన కానీ, 11న కానీ అనంతపురంలో జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వైసీపీ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసిందని విశ్వసనీయ సమాచారం.
రైతులు, నిరుద్యోగులకు ఇంపార్టెన్స్..
ప్రధానంగా రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ, ఉద్యోగులకు పీఆర్సీలో భాగంగా ఐఆర్ ప్రకటన అంశాలున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం తదితర వాటిని కూడా పరిశీలించినట్టు సమాచారం. రైతు రుణమాఫీ విషయంలో ఏ ప్రాతిపదికన చేయాలి అనే చర్చ ఇప్పటికే చేపట్టారు. లక్ష లోపు రుణమా, రెండు లక్షల రుణమా? అనేది నిర్ణయించాల్సి ఉందని సమాచారం. వాస్తవానికి రెండు లక్షల లోపు అప్పులున్న రైతులకు రుణమాఫీ చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది.. లక్షలోపు రుణమాఫీ చేస్తే ఎంత భారం పడుతుందనే విషయాలను ఇప్పటికే నిపుణులతో చర్చించి, ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అనంత సభలో బయటపెట్టే అవకాశం..
అది ఎంతవరకు నిజం అనేది అనంతపురంలో సిద్ధం సభ తర్వాతే తెలుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా లాంటి మరికొన్ని జిల్లాలను తీసుకొని తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఖరీఫ్ సీజన్‌లో, అదే విధంగా రబీ సీజన్‌లోనూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతోపాటు తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే రుణమాఫీపై కొండంత ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి మూడు నెలల కిందట శ్రీ సత్య సాయి జిల్లా పర్యటనలో రైతు భరోసా నిధుల పంపిణీకి బటన్ నొక్కే కార్యక్రమానికి వచ్చిన సీఎం.. పుట్టపర్తి సభలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ, త్వరలో అనంతపురంలో జరిగే సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ రుణమాఫీపై ప్రకటన చేసి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిత్యం కరువు కాటకాలతో సతమతమయ్యే ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగే సిద్ధం సభలో రుణమాఫీ ప్రకటన వైకాపాకు కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు భావిస్తున్నారు.
పీఆర్సీ పెంపు.. ఐఆర్ ప్రకటన..
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు పీఆర్సీ పెంపునకు సంబంధించి ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు సానుకూలంగా ప్రభుత్వం ఉందని చెప్పేందుకు నిర్ణయించినట్లు భావిస్తున్నారు. నిరుద్యోగుల ఆశలకు అవకాశం కల్పించేందుకు ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ ప్రకటన కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఇటీవలనే మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన కూడా చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం హామీతో కాంగ్రెస్ పార్టీ అటు కర్నాటకలోనూ, ఇటు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ సైతం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు గల సాధ్య అసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.