అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8వ తేదీ ఇడుపుల పాయకు కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రానున్న ట్లు విశ్వసనీయ సమాచారం. వైఎస్‌ఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం వైఎస్ విజయమ్మతో వారు భేటీ అయి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోనియా గాంధీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇడుపులపాయను పరిశీలించడాన్ని బట్టి చూస్తుంటే వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోనియాతో పాటు రాహుల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అయితే వారితో చర్చలు జరపడా నికి వైఎస్ విజయమ్మ అంగీకరిస్తారో.. లేదో అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. విజయమ్మతో భేటీ అయ్యేం దుకు అవకాశం ఉన్నా.. లేకపోయినా వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమానికి మాత్రం వారు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్‌లో కీలక పగ్గాలు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో సోనియా, రాహుల్‌లు ఇడుపుల పాయకు రానుండడం ప్రధాన చర్చనీయాం శంగా మారింది. షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ అవకాశం కూడా కల్పిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఇటీవల షర్మిల బెంగుళూరు వెళ్లి కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంలోనే షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే స్వాగతిస్తామని, తెలంగాణలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తామని ఆ పార్టీకి చెందిన జాతీయ నేతలు కొందరు గత కొంతకాలంగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో ఆ పార్టీ ్అ ధినేతలు ఇడుపులపాయకు రావాలని నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి చూస్తుంటే విజయమ్మ చర్చలకు అంగీకరిస్తే తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త సమీకరణలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంగీకరిస్తే.. విజయమ్మతో భేటీ, చర్చలు
తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ అవసరం అయితే తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సేవలను కూడా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల కర్ణాటకకు చెందిన కొంతమంది ఆ పార్టీ నేతలు ఆ దిశగానే షర్మిలతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం తొలిసారిగా ఇడుపులపాయ రావాలని నిర్ణయం తీసుకున్న సోనియా, రాహుల్ గాంధీలు విజయమ్మతో చర్చలు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె అంగీకరిస్తే చర్చలు జరిపి షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ ఇవ్వడంతో పాటు తెలంగాణలో అత్యంత కీలకమైన పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ పదవిని ఇచ్చే ఆలోచనతో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.