ఇడుపులపాయ – దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.. వైఎస్సార్ ఘాట్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు మంత్రులు, వైసీపీ నేతలు కూడా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
ఇక, అంతకుముందు ఈరోజు ఉదయం వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. శుక్రవారమే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల.. ఈరోజు ఉదయం తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్సార్ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు.
ఇదిలాఉంటే, వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ సీఎం జగన్ సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు. ‘‘నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.