Wednesday, November 20, 2024

AP | 9న జగన్‌తో మీట్‌ అండ్‌ గ్రీట్‌ అంటూ ప్రచారం.. నమ్మొద్దన్న వైసీపీ వర్గాలు

అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లి పర్యటనపై ప్రత్యర్ధులు సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. పూర్తిగా వ్యక్తిగత పర్యటనలో ఉన్న ఆయన సమావేశాల్లో ప్రజలను కలుస్తారంటూ తప్పుడు ప్రచారాలతో సోషల్‌ మీడియా వేదికగా కొంత మంది దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతోంది. దీనికి సబంధించిన పార్టీ యూకే కమిటీ స్పందించింది. విపరీతార్ధాలు తీస్తూ చేస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మెద్దంటూ సూచించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన సతీమణి భారతితో కలిసి లండన్‌ వెళ్లి తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డితో కలిసి సరదాగా గడుపుతున్నారు. సాధారణంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు.. ఎన్నారైలు, ఆ పార్టీకి సంబంధించిన ఎన్నారై విభాగాలు ఆయన్ను కలిసి మాట్లాడటం సహజం.

కానీ జగన్‌ పూర్తిగా వ్యక్తిగతమైన పర్యటన కావడంతో.. ఆయన లండన్‌లో ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలు వైఎస్సార్సీపీ నేతలకు కూడా తెలీదు. సెప్టెంబర్‌ 2వ తేదీ రాత్రి ప్రత్యేక విమానంలో లండన్‌ బయల్దేరి వెళ్లిన జగన్‌ దంపతులు తిరిగి 12వ తేదీన తిరిగి రానున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టు ఆయనకు అనుమతులిచ్చింది. జగన్‌ లండన్‌ పర్యటన ఖరారైన నాటి నుంచి ఆయనపై ప్రత్యర్థి వర్గం సోషల్‌ మీడియాలో పలు రకాల ట్రోలింగులకు దిగుతోంది. కోర్టు పర్మిషన్‌ లేకుండా తన బిడ్డలను చూసేందుకు వెళ్లలేని వాడు.. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడంటూ మొదలైన ట్రోలింగ్‌.. ఇప్పుడు వేరే లెవల్‌కు చేరుకుంది.

లండన్‌ పర్యటనలో ఉన్న జగన్‌ సెప్టెంబర్‌ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ అందుబాటులో ఉంటారని.. వచ్చి కలవొచ్చని.. లంచ్‌ కూడా ఉంటుందని సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన వైరల్‌ అయ్యింది. మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ అవర్‌ లీడర్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అంటూ ఈ ప్రకటనను పొందుపర్చారు. లండన్‌ ఎంహెచ్సీ సెంటర్‌ ఇందుకు వేదిక అంటూ ఆహ్వానితుల వివరాలేవీ లేకుండా ఈ ప్రకనటనను వదిలారు. జగన్‌ అభిమానులు ఇలా చేశారేమో అనుకుంటే అది అవాస్తమని తేలటానికి ఎంతో సమయం పట్టలేదు. ఆయనంటే ఏమాత్రం గిట్టని బ్యాచ్‌ పనే ఇదని వైసీపీ లండన్‌ వింగ్‌ స్పష్టంచేసింది. అయితే, జగన్‌ను లండన్‌లో కలవొచ్చనే ప్రకటన వైరల్‌ కావడంతో.. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్‌ ప్రదీప్‌ చింతా స్పందించారు.

జగన్‌ లండన్‌ పర్యటన పూర్తి వ్యక్తిగతమన్న ఆయన.. ఈ టూర్‌ గురించి మీకెంత తెలుసో.. మాకు కూడా అంతే తెలుసన్నారు. యూకేలో ఏ మీటింగును నిర్వహించడం లేదని.. ఎవరో ఆకతాయిలు కావాలనే వాట్సాప్‌లలో దాన్ని సర్క్యులేట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారని.. దాన్ని పట్టించుకోవద్దని ఆయన సూచించారు. జగన్‌తో ఎలాంటి మీటింగులు లేవని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement