Tuesday, November 19, 2024

Exclusive కడపలో వార్ – లోక్ సభ బరిలో షర్మిల

ఎన్నికల్లో పోటీకి ఏఐసీసీ ఆదేశం
ఇక పుట్టినగడ్డపై వైఎస్ తనయ ప్రతాపం
అన్న గడిలో.. చెల్లెమ్మ తాండవం
వివేకానంద హత్యే కేసే సోదరి ఆయుధం
అవినాష్ రెడ్డే టార్గెట్
ట్రిపుల్ కూటమికీ ఆమె ఆధారం
దాయాదుల మధ్య యుద్ధమేనా?
25 వరకూ… తప్పని టెన్షన్ టెన్షన్

పీసీసీ ఎపి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి ఎన్నికల బరిలో దిగుతున్నారు. కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఏఐసీసీ పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈనెల 25న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అభ్యర్థుల జాబితాలో షర్మిల పేరు చేర్చినట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి వరకు కడప పార్లమెంటుకు మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్. సౌభాగ్యమ్మ లేదా ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి పోటీ చేస్తారని అంతా భావించారు. వీరికి టీడీపీ,- జనసేన,- బీజేపీల మద్దతు ఉందని ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఒకవైపు రాజకీయ సర్కిల్స్ లో చర్చ సాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమెను కడప పార్లమెంటు బరిలో దింపాలని ఏఐసీసీ సంకల్పించినట్లు సమాచారం.

కడప – ప్రభ న్యూస్ బ్యూరో – కడప జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పై పట్టు సాధించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సొంత జిల్లాలోనే ఆయనని ఇరుకుని పెట్టాలని వ్యూహాలు పన్నుతున్నాయి. ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. కడప జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాలని ప్రతిపక్ష తెలుగుదేశం గట్టిగా ప్రయత్నిస్తోంది. జనసేన, బీజేపీలు టీడీపీతో జట్టు కట్టి మద్దతునిస్తున్నాయి. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా రంగం లోకి దిగుతున్నారు.

అన్న వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు పావులు కలుపుతున్నారు. అందులో భాగంగా నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగేందుకు సిద్ధపడినట్టు సమాచారం. కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఏఐసీసీ పెద్దలు కూడా షర్మిలను ఎన్నికల బరిలో దిగాలని ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. కడప పార్లమెంట్ అభ్యర్థిగా షర్మిలను ఎంపిక చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందని, అందులో షర్మిల పేరు కూడా చేర్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే జిల్లా రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా వేడెక్కాయి.

అవినాష్ రెడ్డే టార్గెట్ …

కడప పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈయన మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. వివేక సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత రెడ్డి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విషయంలోనే వైఎస్. జగన్ ను వివేక కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల్లో వివేక కుటుంబ సభ్యులు పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. కడప పార్లమెంటు లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వివేక సతీమణి సౌభాగ్యమా, లేదా ఆయన కుమార్తె సునీత రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టే ఈనెల 15న కడపలో సునీత రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

- Advertisement -

రాజకీయ ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ అటువంటి ప్రకటన ఏది వెలువడ లేదు. ఈ సమావేశానికి హాజరైన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి మాత్రం తాను సునీతకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, అన్న జగన్ పై పోరాడుతానని గట్టిగా చెప్పారు. గతంలో కూడా సునీతతో చర్చించి వివేక కుటుంబాన్ని కాంగ్రెస్ లో చేర్చాలని షర్మిల తీవ్రంగా ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో కడప పార్లమెంటు స్థానానికి షర్మిల రెడ్డి పేరు వినిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి పై షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. కొద్దిరోజులుగా కడప పార్లమెంటు తెరపై షర్మిల పేరు వినిపించిన ఆమె పీసీసీ అధ్యక్షురాలు హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయాల్సిన రావడంతోపాటు ఇతర ఎన్నికల బిజీలో ఉంటారని పోటీ చేయకపోవచ్చని ఒక వర్గం రాజకీయ పండితులు చెబుతూ వచ్చారు.

ఏఐసీసీ అనూహ్య వ్యూహం

అనూహ్యంగా ఏఐసీసీ రూటు మార్చింది. షర్మిలను కడప ఎన్నికల బరిలో దింపాలని సంకల్పించింది. కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ విషయంపై ఏఐసీసీ నేతలు షర్మిలతో చర్చించినట్లు సమాచారం. కడప పార్లమెంటు స్థానంలో పోటీ చేసేందుకు షర్మిల అంగీకరించారని తెలుస్తోంది. ఈనెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల బోగట్టా. ఈ వార్తతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పోటీతో షర్మిల నేరుగా అన్న జగన్ పైనే పోటీకి దిగినట్లుగా జిల్లా ప్రజలు భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే షర్మిల దూకుడుగా వెళ్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులేస్తోంది.

ప్రధానంగా తన తండ్రి వైఎస్ సమకాలీకులపై ఆమె దృష్టి సారించారు. వారి సూచనలు సలహాలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పాత కాపులను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వ్యక్తిగత.. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తన వ్యూహాలకు పదును పెడుతూ సొంత జిల్లా కడప నుంచే పావులు కదుపుతున్నారు. తన బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత లేదా సతీమణి సౌభాగ్యమ్మను ఎన్నికల బరిలో దింపేందుకు ప్రయత్నించడం.. కరుడుకట్టిన కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన మాజీ మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి తో భేటి కావడం.. అహమదుల్లా వంటి సీనియర్లను పార్టీలో చేర్చుకోవడంతో షర్మిల తన వైఖరి ఏమిటో స్పష్టమవుతోంది.

దాయాదుల పోరు తప్పదా?

కాగా.. ఇక్కడ్నుంచి వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనకు అధిష్టానం సీటివ్వదని పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ జగన్ మాత్రం అటు తిరిగి.. ఇటు తిరిగి అవినాష్కే టికెట్ ఇచ్చారు. ఆయనపై వ్యతిరేకతతో కచ్చితంగా నియోజకవర్గ ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని కాంగ్రెస్ అధిష్టానం గంపెడాశతో ఉన్నట్టు సమాచారం. షర్మిల ఖచ్చితంగా పోటీచేస్తే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు బరిలోకి దిగినట్లు అవుతుంది. అవినాష్ , షర్మిల మధ్య పెద్ద సమరమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement